నటుడు నాని సమర్పణలో, ‘వాల్ పోస్టర్’ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ‘కోర్ట్’ చిత్రానికి రామ్ జగదీష్ తొలిసారిగా దర్శకత్వం వహించారు. సుమారు 10 కోట్ల పరిమిత బడ్జెట్‌తో, పెద్ద స్టార్ క్యాస్టింగ్ లేకుండా తెరకెక్కినప్పటికీ, ‘కోర్ట్’ సినిమా తన బలమైన కథనం, వాస్తవిక చిత్రీకరణతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా న్యాయ వ్యవస్థను చూపించిన తీరు, నటీనటుల ప్రతిభ సినిమా విజయానికి కీలకమయ్యాయి.
ప్రారంభం నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోయిన ఈ చిత్రం, తొలి రోజే 8 కోట్లు వసూలు చేసి సత్తా చాటింది. మొదటి వారాంతం ముగిసేసరికి 23 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద పట్టు నిలుపుకుంది. ఇక రెండో వారం ముగిసే సమయానికి, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా వసూళ్లు 50 కోట్ల మార్కును దాటడం విశేషం. తెలుగులో ఒక కోర్ట్ రూమ్ డ్రామా ఈ స్థాయి వసూళ్లు సాధించడం అరుదని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
అలాంటి ఈ సినిమా ఈ నెల 11వ తేదీ నుంచి ‘నెట్ ఫ్లిక్స్’ లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్ల నుంచి మాత్రమే కాదు, ఓటీటీ వైపు నుంచి కూడా ఈ సినిమాకి అనూహ్యమైన రెస్పాన్స్ లభిస్తోంది. నాన్ ఇంగ్లిష్ చిత్రాల విభాగంలో .. గ్లోబల్ గా 5వ స్థానంలో ఈ సినిమా ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాకి ఈ స్థాయి రెస్పాన్స్ వస్తుండటం విశేషమంటూ మేకర్స్ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు.