రాష్ట్రంలో 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు గాను మొదటి దశలో ప్రయోగాత్మకంగా 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏప్రిల్ 10వ తేదీ నుంచి స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలులోకి తీసుకురాబోతున్నట్లు మంత్రి పొంగులేటి ప్రకటించారు. మొదటగా హైదరాబాద్లోని ఆజంపుర, చిక్కడపల్లి, సంగారెడ్డి జిల్లా సదాశివపేట, మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్, వల్లభ్ నగర్, రంగారెడ్డి జిల్లా శంషాబాద్, సరూర్ నగర్, చంపాపేట్, పెద్దపల్లి జిల్లా రామగుండం, ఖమ్మం జిల్లా కూసుమంచి, ఖమ్మం (R.O), మేడ్చల్ (R.O), మహబూబ్ నగర్(R.O), జగిత్యాల, నిర్మల్, వరంగల్ ఫోర్ట్, వరంగల్ రూరల్, కొత్తగూడెం, ఆర్మూర్, భువనగిరి, చౌటుప్పల్, నాగర్ కర్నూల్ మొత్తం 22 చోట్ల ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని తెలిపారు.
సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఒకేరోజు ఒకే సమయంలో ఎక్కువ దస్తావేజులు రిజిస్ట్రేషన్ కోసం సమర్పించడం వలన జరిగే జాప్యాన్ని నివారించడానికి ఈ విధానం తీసుకువచ్చినట్లు తెలిపార. సబ్-రిజిస్ట్రార్ కార్యాలయ రోజు వారి పని వేళలను 48 స్లాట్లుగా విభజించడం జరిగిందన్నారు. ప్రజలు నేరుగా “registration.telangana.gov.in” వెబ్-సైట్ ద్వారా తమకు అనుకూలమైన తేదీ, సమయానికి స్లాట్ బుక్ చేసుకుని ఆ రోజు నిర్ధేశించిన సమయానికి వచ్చి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని వెంటనే వెళ్లిపోవచ్చన్నారు. స్లాట్ బుక్ చేసుకోనివారి కోసం ఏదైనా అత్యవసర సందర్భాలలో ప్రతిరోజు సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు, ఐదు వాక్ ఇన్ రిజిస్ట్రేషన్లను అనుమతిస్తారని, నేరుగా కార్యాలయానికి వచ్చిన వారికి ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ పద్దతిలో దస్తావేజులు స్వీకరిస్తారని తెలిపారు. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని సులభతరం చేయడానికి, 48 స్లాట్స్ కన్నా ఎక్కువ స్లాట్స్ అవసరం ఉన్న కార్యాలయాలలో అదనపు సిబ్బందిని నియమిస్తామన్నారు. ఇప్పుడున్న సబ్ రిజిస్ట్రార్లకు తోడుగా అదనపు సబ్ రిజిస్ట్రార్లను నియమిస్తామని, ప్రయోగాత్మకంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కుత్బుల్లాపూర్ కార్యాలయంలో అదనంగా ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లతోపాటు సిబ్భందిని నియమించడం జరిగిందన్నారు. దీంతో కుత్బుల్లాపూర్ కార్యాలయంలో 144 స్లాట్స్ అందుబాటులో ఉంటాయని మంత్రి పొంగులేటి తెలిపారు.
స్లాట్ బుకింగ్ విధానాన్ని దృష్టిలో పెట్టుకొని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను రీ ఆర్గనైజేషన్ చేస్తున్నామని, ఇందులో భాగంగా అధిక రద్దీ, తక్కువ రద్దీ ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిని అనుసంధానం చేసి పనిభారాన్ని సమానం చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ విధానాన్ని ముందుగా రంగారెడ్డి జిల్లాలోని చంపాపేట, సరూర్ నగర్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల అధికార పరిధిని విలీనం చేయడం జరిగిందని తెలిపారు.