ఇప్పటి వరకు జరిగిన సొరంగ ప్రమాదాల్లో ఎస్ఎల్‌బీసీ ప్రమాదం చాలా క్లిష్టమైందని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ సొరంగం 14 కిలోమీటర్ల మేర ఉందని, చివరి 50 మీటర్లలో సహాయక చర్యలు చేపట్టేందుకు ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు. అక్కడ సహాయక చర్యలు చేపడితే రెస్క్యూ ఆపరేషన్ చేసేవారికి కూడా ప్రమాదమేనని ఆయన అన్నారు.
ఎస్ఎల్‌బీసీ ప్రమాదస్థలం వద్ద సహాయక చర్యలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చివరి 50 మీటర్లలో రోబోల సహాయంతో సహాయక చర్యలు చేపట్టాలని చూస్తున్నామని తెలిపారు. కేరళ జాగిలాలతో అన్వేషిస్తే ఒకచోట ముగ్గురు ఉన్నట్లుగా గుర్తించామని అన్నారు. ఆచూకీ తెలియకుండా పోయిన వారి కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు