తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ తిరుగులేని విజయాన్ని సాధించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పట్టభద్రులు సీఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటి తీర్పు ఇచ్చారని చెప్పారు. రాష్ట్ర ప్రజలు బీజేపీ వైపు ఉన్నారనే విషయం ఈ ఎన్నికల ఫలితాలతో రుజువయిందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధించి రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఖమ్మం-నల్గొండ-వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటమిపై సమీక్షించుకుంటామని కిషన్ రెడ్డి తెలిపారు. అక్కడ కూడా బలోపేతం అవుతామని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి తనను టార్గెట్ చేశారని… ఆయన తనపై చేసిన వ్యక్తిగత విమర్శలపై తాను స్పందించనని అన్నారు. విధానపరమైన అంశాలపైనే తాను స్పందిస్తానని చెప్పారు. ప్రజలు ఇచ్చిన ఈ తీర్పు తమపై బాధ్యతను మరింత పెంచిందని తెలిపారు. గ్రాడ్యుయేట్లు, టీచర్లు తమపై నమ్మకం ఉంచి, గెలిపించడం సంతోషంగా ఉందని చెప్పారు.