కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు నేడు హైదరాబాద్ లోని కవాడిగూడలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ… తాను కేంద్ర మంత్రి అయ్యాక చంద్రబాబు ఓ సూచన చేశారని… నువ్వు కేవలం ఆంధ్రప్రదేశ్ కోసం మాత్రమే పనిచేయకుండా, రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ది కోసం పనిచేయాలి అని గైడెన్స్ ఇచ్చారని వెల్లడించారు. ఏపీ విమానయాన రంగం అభివృద్ధికి ఎంత కృషి చేస్తావో, తెలంగాణ విమానయాన రంగం అభివృద్ధి కోసం కూడా అంతే పాటుపడాలి అని చెప్పారు అని వివరించారు.
కేంద్రమంత్రిగా ఎంతో అనుభవం ఉన్న కిషన్ రెడ్డి కూడా తనకు మార్గదర్శిగా నిలిచారని, పెద్దల అనుభవాన్ని ఆసరాగా చేసుకుని తాను ముందుకు పోతున్నానని రామ్మోహన్ నాయుడు తెలిపారు. తాజాగా, వరంగల్ ఎయిర్ పోర్టుకు తన హయాంలోనే క్లియరెన్స్ రావడం సంతోషదాయకం అని పేర్కొన్నారు.
వరంగల్ ఎయిర్ పోర్టు గతంలో ఆసియాలోనే అతి పెద్ద విమానాశ్రయంగా ఉండేదని అన్నారు. 1981 వరకు వరంగల్ ఎయిర్ పోర్టులో ఏదో ఒక కార్యకలాపం జరుగుతూనే ఉండేదని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.