మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈరోజు మహాకుంభమేళా త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులపై సుమారు 20 క్వింటాళ్ల పూలను హెలికాప్టర్లతో వెదజల్లినట్లు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఈరోజు కుంభమేళా ముగుస్తోంది.
ఈ నేపథ్యంలో యూపీ శాసనమండలిలో యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, మక్కాకు ఏడాదికి 1.4 కోట్ల మంది, వాటికన్ సిటీకి 80 లక్షలమంది వెళుతుంటారని గుర్తు చేశారు. అయోధ్యకు గత 52 రోజులలో 16 కోట్ల మంది వచ్చారని వెల్లడించారు.
ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అంచనా ప్రకారం మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు సాయంత్రం నాలుగు గంటల వరకు 1.32 కోట్ల మంది కుంభమేళాలో పుణ్యస్నానాలాచరించినట్లు వెల్లడించింది. భారత్, చైనా మినహా ప్రపంచంలోని అన్ని దేశాల జనాభా కంటే ఎక్కువ మంది ప్రయాగ్‌రాజ్‌ను సందర్శించినట్లు తెలిపింది. కుంభమేళాకు వచ్చిన భక్తుల సంఖ్య 65 కోట్లు దాటినట్లు తెలిపింది.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు కుంభమేళాలో పుణ్యస్నానమాచరించినట్లు వెల్లడించింది. 37 వేల మంది పోలీసులు, 14 వేల మంది హోంగార్డులు కుంభమేళా కోసం విధులు నిర్వర్తించినట్లు తెలిపింది. 2,750 ఏఐ ఆధారిత సీసీటీవీలు, మూడు జల్ పోలీస్ స్టేషన్లు, 18 జల్ పోలీస్ కంట్రోల్ రూంలను, 50 వాచ్ టవర్లతో భద్రతను పర్యవేక్షించినట్లు తెలిపింది.