ఐసీసీ మేజర్ ఈవెంట్లలో పాకిస్థాన్ పై తన ఆధిపత్యాన్ని భారత్ మరోసారి ఘనంగా చాటుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్-ఏలో నేడు జరిగిన లీగ్ మ్యాచ్ లో భారత్ చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది. బ్యాటింగ్ కింగ్ విరాట్ కోహ్లీ (100 నాటౌట్) అద్భుత సెంచరీ సాధించిన వేళ… టీమిండియా 6 వికెట్ల తేడాతో పాక్ ను చిత్తు చేసింది. ఈ విజయంతో భారత్ సెమీస్ బెర్తును దాదాపు ఖాయం చేసుకుంది.
దుబాయ్ లో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాక్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా బౌలర్లు విజృంభించడంతో పాక్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం, 242 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియా సునాయాసంగా విజయాన్ని అందుకుంది. కేవలం 4 వికెట్లు కోల్పోయి 42.3 ఓవర్లలో 244 పరుగులు చేసింది.
టీమిండియా ఇన్నింగ్స్ కు వెన్నెముకలా నిలిచిన కోహ్లీ 111 బంతుల్లో సరిగ్గా 100 పరుగులు చేశాడు. కోహ్లీ ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు ఉన్నాయి. విన్నింగ్ షాట్ ఫోర్ కొట్టిన కోహ్లీ అటు సెంచరీ పూర్తి చేసుకోవడమే కాకుండా, ఇటు జట్టుకు విజయాన్ని అందించాడు. కోహ్లీకిది వన్డేల్లో 51వ సెంచరీ కాగా, పాకిస్థాన్ పై నాలుగోది.
అంతకుముందు, కెప్టెన్ రోహిత్ శర్మ 15 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్ తో 20 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ శుభ్ మన్ గిల్ 46, శ్రేయాస్ అయ్యర్ 56 పరుగులు చేశారు. హార్దిక్ పాండ్యా 8 పరుగులకే వెనుదిరిగినా… అక్షర్ పటేల్ (3 నాటౌట్) తో కలిసి కోహ్లీ మిగతా పని పూర్తి చేశాడు. పాక్ బౌలర్లలో షహీన్ అఫ్రిది 2, అబ్రార్ అహ్మద్ 1, కుష్ దిల్ షా 1 వికెట్ తీశారు.