బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలు, రోడ్ల దుస్థితిపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. సిటీ రోడ్లను బాగు చేయడం దేవుడి వల్ల కూడా కాదని చెప్పారు. నగరంలో జనసాంద్రత విపరీతంగా పెరిగిపోయిందని, వాహనాల సంఖ్య కూడా భారీగా పెరిగిందని అన్నారు. ప్రస్తుతం బెంగళూరు జనాభా 1.4 కోట్లు దాటిందని, సిటీలో రిజిస్టర్ అయిన వాహనాల సంఖ్య 1.1 కోట్లు అని వెల్లడించారు. నిత్యం బిజీగా రాకపోకలు సాగించే వాహనాల కారణంగా రోడ్లపై తరచూ గుంతలు ఏర్పడుతున్నాయని వివరించారు. ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయించడం కష్టంగా మారిందని, వీటిని దేవుడు కూడా బాగుచేయలేడని చెప్పారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి తాను టన్నెల్ రోడ్ల నిర్మాణం గురించి చెబుతున్నానని గుర్తు చేశారు. ట్రాఫిక్ కష్టాలకు టన్నెల్ రోడ్లే పరిష్కారమని పేర్కొన్నారు. అయితే, ఇప్పటి వరకు వీటి నిర్మాణం దిశగా కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. వివిధ సాంకేతిక కారణాల వల్ల టెండర్లు పిలవడం కూడా సాధ్యం కాలేదన్నారు. భూసేకరణకు సంబంధించిన సమస్యలకు తోడు ఆర్థిక సమస్యలు వేధిస్తున్నాయని వివరించారు. దీంతో కొత్త రోడ్ల నిర్మాణాన్ని తాత్కాలికంగా పక్కనపెట్టి ఉన్న రోడ్లకు మరమ్మతులు చేయించాలని నిర్ణయించామన్నారు. రోడ్ల డిజైన్, నిర్వహణలో మార్పులు చేయడం ద్వారా సిటీ వాసుల కష్టాలకు చెక్ పెట్టాలని భావిస్తున్నట్లు డీకే శివకుమార్ వివరించారు.