అన్ని రంగాలను నాశనం చేసినట్టే విద్యారంగాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం చేస్తోందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డికి విద్యారంగంపై కనీస అవగాహన కూడా లేదని విమర్శించారు. కేసీఆర్ హయాంలో గురుకులాల్లో ప్రవేశం కోసం ఒక్క సీటుకు ముగ్గురు అభ్యర్థులు పోటీ పడేవారని… రేవంత్ హయాంలో పరిస్థితి తలకిందులయిందని అన్నారు. గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశ పరీక్షకు 40 వేల సీట్లకు 80 వేల మంది కూడా దరఖాస్తు చేసుకోలేదని చెప్పారు. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ హయాంలో 30కి పైగా ప్రతిభ పాఠశాలలను నెలకొల్పారని… ఆ పాఠశాలల నుంచి ఎంతో మంది ఇంజినీర్లు, డాక్టర్లు వచ్చారని… రేవంత్ హయాంలో ఆ పాఠశాలలను రద్దు చేసే కుట్ర జరుగుతోందని ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. మెడికల్ కాలేజీల్లో ఎస్సీ విద్యార్థుల ఫీజులను కూడా ప్రభుత్వం చెల్లించడం లేదని విమర్శించారు.
గురుకులంలో చదివిన రజక కులానికి చెందిన నందిని బ్యాడ్మింటన్ లో నేషనల్ గేమ్స్ లో బంగారు పతకాన్ని సాధిస్తే… రేవంత్ ప్రభుత్వం ఆమెకు ఎలాంటి ప్రోత్సాహకం ప్రకటించలేదని దుయ్యబట్టారు. బీసీ విద్యార్థిని అయినందుకే ఆమెను పట్టించుకోలేదా? అని ప్రశ్నించారు. తక్షణమే నందినికి కోటి రూపాయల నజరానా ప్రకటించాలని డిమాండ్ చేశారు.