నోటీసులివ్వడానికి మీరెవరు, మీ అయ్య జాగీరా కాంగ్రెస్ నాయకులకు తీన్మార్ మల్లన్న హెచ్చరిక
షోకాజ్ నోటీసులు జారీ చేయడంపై తీవ్రంగా స్పందించిన మల్లన్నకాంగ్రెస్ బీసీల పార్టీ, మా పార్టీని వాడుకొని మీరు పెత్తనం చేస్తారా? అని నిలదీత
బీసీలకు అన్యాయం జరిగితే సహించేది లేదని హెచ్చరిక నాకు నోటీసులు ఇవ్వడానికి మీరెవరు,
కాంగ్రెస్ పార్టీ మీ అయ్య జాగిరా?” అని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ నాయకులను హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం తనకు షోకాజ్ నోటీసులు జారీ చేయడంపై ఆయన తీవ్రంగా స్పందించారు.
రాహుల్ గాంధీ ఆశయాలతో కాంగ్రెస్ పార్టీని పది కాలాల పాటు కాపాడాలనుకునే వారికి తమతో ఎలాంటి ఇబ్బంది లేదని ఆయన స్పష్టం చేశారు. “నాకు నోటీసులు ఇవ్వడానికి మీ అయ్య జాగీరా? కాంగ్రెస్ పార్టీ బీసీల పార్టీ” అని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీలదని ఆయన పేర్కొన్నారు.
మా పార్టీని వాడుకొని మీరు పెత్తనం చేస్తారా? ఈ దమ్కీలు, బెదిరింపులు చెల్లవు” అన్నారు. ఇలా చేస్తే బీసీలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోరని ఆయన హెచ్చరించారు. బీసీలకు అన్యాయం జరిగితే సహించేది లేదని అన్నారు. కుల గణన నివేదికపై ఎమ్మెల్యేలు మాట్లాడకపోవడానికి వారి సమస్యలు వారికి ఉండవచ్చునని, వారిని ప్రజలే చూసుకుంటారని ఆయన అన్నారు.
కుల గణన పూర్తిగా తప్పుల తడకగా ఉందని చెప్పాల్సింది పోయి, పారదర్శకంగా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్పడం దుర్మార్గమని ఆయన అన్నారు. “బీసీ ప్రజలారా, ఇది సమగ్ర కుల సర్వే కాదు. ఇది అగ్ర కుల సర్వే. ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లను కాపాడుకోవడానికి జానారెడ్డి ఆడిన నాటకమే ఈ సర్వే. దీనికి ఎలాంటి ప్రమాణాలు పాటించలేదు” అని ఆయన విమర్శించారు.