పాక్ ఆక్రమిత కశ్మీర్ లో అడుగుపెట్టనున్న హమాస్.. అలర్ట్ అయిన ఇంటెలిజెన్స్
పీవోకేలో ఈరోజు కశ్మీర్ సంఘీభావ దినోత్సవం
కార్యక్రమానికి హాజరవుతున్న హమాస్ నేత
నిన్న హైలెవెల్ మీటింగ్ నిర్వహించిన అమిత్ షా
పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ పాక్ ఆక్రమిత కశ్మీర్ లో అడుగుపెడుతోందనే వార్తలు కలకలం రేపుతున్నాయి. ఈ క్రమంలో భారత ఇంటెలిజెన్స్ వర్గాలు పూర్తిగా అప్రమత్తమయ్యాయి. కశ్మీర్ సంఘీభావ దినోత్సవంలో భాగంగా ఈరోజు పీవోకేలో ‘అల్ అక్సా ఫ్లడ్స్’ పేరుతో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో హమాస్ కు చెందిన సీనియర్ నేత ప్రసంగించనున్నట్టు ప్రచారం జరుగుతోంది. రావల్కోట్ లోని సబీర్ స్టేడియంలో జరగనున్న ఈ కార్యక్రమంలో జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా సంస్థల సీనియర్ నేతలు కూడా పాల్గొనబోతున్నారు.
ఈ కార్యక్రమంలో హమాస్ ప్రతినిధి ఖలీద్ కద్దౌమి ప్రసంగిస్తారని కరపత్రాలు, ఇతర మార్గాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. కశ్మీర్ లో పోరాటాన్ని పాలస్తీనాతో ముడిపెట్టి ఆయన మాట్లాడే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇదే అంశంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిన్న జమ్మూకశ్మీర్ పై హైలెవెల్ మీటింగ్ ను నిర్వహించారు. కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్ల పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. కశ్మీర్ లో వాహన తనిఖీలను తీవ్రతరం చేయాలని ఆదేశించారు.
2024 ఆగస్టులో ఖతార్ రాజధాని దోహాలో హమాస్ నేతలతో లష్కరే తోయిబా ఉగ్రవాది సైఫుల్లా ఖలీద్ భేటీ అయ్యాడు. 2018లోనే ఆయనను ఉగ్రవాదుల జాబితాలో అమెరికా చేర్చింది. లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ కు ఖలీద్ సన్నిహితుడు.