తమిళనాడు (Tamil Nadu)లో అధికార డీఎంకే ప్రభుత్వానికి, గవర్నర్ ఆర్ఎన్ రవికి మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. గవర్నర్ తీరుపై సీఎం స్టాలిన్ విమర్శలు చేసిన మరుసటి రోజే గవర్నర్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ముఖ్యమంత్రికి అంత అహకారం పనికి రాదని విమర్శించింది. ‘‘జాతీయ గీతాన్ని గౌరవించాలని, రాజ్యాంగంలో పొందుపర్చిన ప్రాథమిక విధులను నిర్వర్తించాలని చెప్పడాన్ని అసంబద్ధ చర్యగా, చిన్నపిల్లల చేష్టగా సీఎం స్టాలిన్ పేర్కొన్నారు.. భారత్‌ను ఓ దేశంగా గుర్తించని, ఆ దేశ రాజ్యాంగాన్ని గౌరవించని నేత.. వాటి వెనక ఉన్న ఉద్దేశాలను వంచించడం సరికాదు. ఇటువంటి అహంకారం మంచిది కాదు. దేశమే సర్వోన్నతం, రాజ్యాంగమే అత్యున్నతమనే విషయాన్ని ఆయన మర్చిపోవద్దు. వాటిపట్ల అవమానాన్ని ప్రజలు సహించరు’’ అని రాజ్‌భవన్ పేర్కొంది.
జాతీయ గీతం ఆలపించలేదని..
కాగా.. ఇటీవల శాసనసభ తొలి సమావేశం సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపించలేదన్న కారణంతో తన ప్రసంగాన్ని చదవకుండానే గవర్నర్ నిష్క్రమించారు. దీంతో, గవర్నర్ ఆర్ఎన్ రవి, సీఎం ఎంకే స్టాలిన్‌కు మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. అన్ని శాసనసభల్లోనూ గవర్నర్ ప్రసంగానికి ముందు, తర్వాత జాతీయ గీతాన్ని పాడతారని, ఇక్కడ ప్రసంగానికి ముందు ఆలపించాలని కోరినా.. ఉద్దేశపూర్వకంగానే నిరాకరించారని రాజ్‌భవన్ అంతకుముందు తెలిపింది. గవర్నర్ చర్యలు ఆయన పదవి, హోదాకు తగినట్లుగా లేవని స్టాలిన్ ఎక్స్ లో స్పందించారు. రాష్ట్రాభివృద్ధిని గవర్నర్ జీర్ణించుకోలేకపోతున్నారని శనివారం మరోసారి గవర్నర్ పై విమర్శించారు. దీంతో, స్టాలిన్ పై రాజ్‌భవన్ ఈ విధంగా స్పందించింది.