*గుడిసెలు వేసుకున్న పేదలందరికీ పట్టాలు ఇవ్వాలి* – గుడిసెల కాలనీలో మౌలిక వసతులు కల్పించాలి – సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య – కలెక్టర్ కార్యాలయం ముందు సీపీఐ ధర్నా చేవెళ్ల, ఫిబ్రవరి 23 (ప్రజా జ్యోతి): చేవెళ్ల పట్టణంలోని సర్వే నెంబరు 75 లోని నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న నిరుపేదలకు తక్షణమే ఇండ్ల స్థలాల పట్టాలు మంజూరు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నియోజకవర్గ ఇన్‌చార్జి రామస్వామి అధ్యక్షతన సీపీఐ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. నాలుగేళ్లుగా పేదలు సీపీఐ జెండా పట్టుకుని గుడిసెలు వేసుకుని నివసిస్తున్నప్పటికీ ఇప్పటివరకు పట్టాలు ఇవ్వకపోవడం అన్యాయమని జంగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఇంటి స్థలం సర్టిఫికెట్లు మంజూరు చేసి, కాలనీలో తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ, రహదారులు వంటి మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. శంకర్‌పల్లి మండలంలో గతంలో 500 మందికి ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చినా స్థలాలు చూపించలేదని ఆరోపిస్తూ, అక్కడి సమస్యను కూడా వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని పేదలకు న్యాయం చేయాలని కోరారు.మోకిలా పొన్నగుట్ట తండాలో గిరిజన రైతుల భూములను ల్యాండ్ పూలింగ్‌లో తీసుకుని, వారికి కేటాయించాల్సిన 800 గజాల స్థలాలను ఇవ్వకుండా ఇతరుల పేర్లు ఎంజాయ్‌మెంట్ సర్వేలో చేర్చడం అన్యాయమని విమర్శించారు. అసలైన గిరిజన రైతుల పేర్లను జాబితాలో చేర్చి హక్కుల ప్రకారం స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సుమారు 200 మంది నిరుపేదలు ధర్నాలో పాల్గొని, పేదలకు న్యాయం జరిగే వరకు కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మాజీ జిల్లా కార్యదర్శి పుస్తకాల నర్సింగ్‌రావు, రాష్ట్ర నాయకులు పానుగంటి పర్వతాలు, జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రభు, వడ్ల సత్యనారాయణ బాతరాజు నరసింహ, మండల కార్యదర్శులు సత్తిరెడ్డి, కే శ్రీనివాస్ పి సుధీర్ జిల్లా సమితి సభ్యులు మంజుల సుధాకర్ గౌడ్, సక్రు నాయక్ తదితరులు పాల్గొన్నారు. తదితరులు పాల్గొన్నారు.

Rangareddy Bureau
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *