ఇన్‌స్టా పరిచయం.. సెప్టిక్ ట్యాంక్‌లో ముగింపు: ప్రియురాలిని చంపి పూడ్చేసిన ప్రియుడు!

V. Sai Krishna Reddy
1 Min Read

భోపాల్‌లో దారుణ హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. తన ప్రియురాలిని హత్య చేసి, మృతదేహాన్ని ఓ ఇనుప పెట్టెలో కుక్కి సెప్టిక్ ట్యాంక్‌లో పడేసిన ఘటనలో ప్రధాన నిందితుడితో పాటు అతడి కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. మృతదేహం దొరికిన 24 గంటల్లోనే పోలీసులు ఈ కేసును ఛేదించారు.

నిషత్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని కమల్ నగర్‌లో గురువారం సాయంత్రం ఓ సెప్టిక్ ట్యాంక్ నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడకు చేరుకుని చూడగా, ఇనుప పెట్టెలో కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న మహిళ మృతదేహం బయటపడింది. చేతిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా మృతురాలిని మహారాష్ట్రలోని గోండియాకు చెందిన యువతిగా గుర్తించారు. ఆమె వయసు, పేరుపై భిన్నమైన కథనాలు వినిపిస్తున్నాయి.

పోలీసుల విచారణలో ఆటో డ్రైవర్ అయిన సమీర్ ఖాన్‌తో యువతికి ఏడాది క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడినట్లు తేలింది. కొద్ది నెలల క్రితం ఆమె భోపాల్ వచ్చి సమీర్‌తో కలిసి ఉంటోంది. అయితే, ఇప్పటికే పెళ్లయిన సమీర్‌ను పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి చేయడంతో పాటు, డబ్బుల కోసం గొడవ పడుతోందని పోలీసులు తెలిపారు. ఈ వివాదాలే హత్యకు దారితీశాయి.

ఫిబ్రవరి 7 లేదా 8న సమీర్ ఆమెను గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం తన తల్లి, సోదరుడు, సోదరి సహాయంతో మృతదేహాన్ని ఇనుప పెట్టెలో ఉంచి, ఇంటికి సమీపంలోని ఖాళీ స్థలంలో ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లో పడేశాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సమీర్‌తో పాటు అతడి కుటుంబ సభ్యులు ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసుపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *