- అక్రమ గంజాయి రవాణాదారుల అరెస్ట్
- 36కిలోల 878 గ్రాముల గంజాయి పట్టివేత
- ఒక మొబైల్ ఫోన్, యమహా మోటార్ సైకిల్ స్వాధీనం
- వరంగల్ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్ డిఎస్పి పి రమేష్ కుమార్
వరంగల్ సిటీ, ఫిబ్రవరి 13 (ప్రజాజ్యోతి):
అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 36 కిలోల 878 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్న ఘటన వరంగల్ నగరంలో చోటుచేసుకుంది. కేసు గురించి నార్కోటిక్స్ డిఎస్పి పి రమేష్ కుమార్ శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ గురువారం మధ్యాహ్నము పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఒరిస్సా నుంచి కరీంనగర్ వైపు అక్రమంగా గంజాయి రవాణా జరుగుతుందని తెలిసిన మీదట ఎస్సై కే కుమారస్వామి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక బృందం ఖమ్మం ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద తనిఖీలు చేపట్టడం జరిగింది. ఆ సమయంలో టిఎస్ 22 ఎఫ్7814 నెంబర్ గల యమహా మోటార్ సైకిల్ పై ఇద్దరు వ్యక్తులు వరంగల్ మీదుగా కరీంనగర్ వెళ్తుండగా వారిని ఆపి తనిఖీ చేయక వారి వద్ద రెండు బ్యాగులలో గంజాయిని గుర్తించినట్లు తెలిపారు. గంజాయి తరలిస్తున్న నిందితులు కరీంనగర్ జిల్లా ఎలబోతారం కు చెందిన బుచల ఆదిత్య (20) అలియాస్ ఇంద్ర, రేకుర్తి కి చెందిన గొల్లపల్లి నిఖిల్ (19) అలియాస్ చింటూ లుగా గుర్తించారు. పట్టుకున్న గంజాయి విలువ సుమారు రూ. 18,43,900గా ఉంటుందని తెలిపారు. నిందితులు ఒడిస్సా రాష్ట్రం పసుపు లంక ప్రాంతం నుండి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి తెలంగాణలో విక్రయించడానికి తెస్తున్నట్లు తెలిపారు. ఈ వ్యవహారంలో వీరికి సహకరించిన వారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డిఎస్పీ తెలిపారు. నిందితులపై ఎన్ డి పి ఎస్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలు మాదక ద్రవ్యాల విక్రయం లేదా రవాణా గురించి ఏదైనా సమాచారం తెలిసిన సమీప పోలీస్ స్టేషన్లో లేదా నార్కోటిక్ పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని తెలిపారు. ప్రభుత్వ టోల్ ఫ్రీ నెంబర్ 1 9 0 8 లేదా వాట్సాప్ నెంబర్ 8712671111 లో కూడా సమాచారం ఇవ్వొచ్చని, వారి వివరాలు గోప్యంగా ఉంచబడునని మరియు వారికి తగిన ప్రోత్సాహక బహుమతులు అందజేయబడునని తెలిపారు. ప్రజలందరి భాగస్వామ్యంతో డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ నిర్మాణంలో అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదామని తెలిపారు. కార్యక్రమంలో నార్కోటిక్ ఇన్స్పెక్టర్ రవీందర్ మరియు ఎస్ఐ కుమారస్వామి సిబ్బంది పాల్గొన్నారు.

