రూ. 25 వేలకే బీహార్ అమ్మాయిలు: ఉత్తరాఖండ్ మంత్రి భర్త వ్యాఖ్యలపై దుమారం

V. Sai Krishna Reddy
1 Min Read

ఉత్తరాఖండ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి రేఖా ఆర్య భర్త గిర్ధారి లాల్ సాహు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా వివాదానికి దారితీశాయి. అల్మోరాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. “ముసలి వయసులో పెళ్లి చేసుకుంటారా? ఒకవేళ పెళ్లి కాకపోతే నేను బీహార్ నుంచి అమ్మాయిని తీసుకొస్తాను. అక్కడ రూ. 20,000 నుంచి 25,000 ఇస్తే అమ్మాయిలు దొరుకుతారు. నాతో రండి, మీకు పెళ్లి చేస్తాను” అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

సాహు వ్యాఖ్యలపై విపక్ష కాంగ్రెస్ నిప్పులు చెరిగింది. ఒక మహిళా మంత్రి భర్త అయి ఉండి దేశంలోని ఆడబిడ్డలను ఇలా వస్తువులతో పోల్చడం సిగ్గుచేటని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. ఈ వ్యాఖ్యలు మానవ అక్రమ రవాణాను ప్రోత్సహించేలా ఉన్నాయని, దీనిపై బీజేపీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీహార్ రాష్ట్ర మహిళా కమిషన్ కూడా ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది. సాహు వ్యాఖ్యలు ఆయన మానసిక స్థితికి నిదర్శనమని మండిపడుతూ, ఆయనకు నోటీసులు జారీ చేస్తామని కమిషన్ చైర్‌పర్సన్ అప్సర ప్రకటించారు.

వివాదం ముదరడంతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం స్పందించింది. గిర్ధారి లాల్ సాహుకు పార్టీతో ఎటువంటి సంబంధం లేదని, మహిళల పట్ల అగౌరవంగా మాట్లాడే ఏ వ్యాఖ్యలనైనా తమ పార్టీ ఖండిస్తుందని బీజేపీ మీడియా ఇన్‌చార్జ్ మన్వీర్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. మరోవైపు, తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, కేవలం ఒక స్నేహితుడి పెళ్లి విషయంపై సరదాగా అన్న మాటలవని సాహు వివరణ ఇచ్చారు. తన మాటల వల్ల ఎవరైనా నొచ్చుకుంటే బేషరతుగా క్షమాపణలు చెబుతున్నానని ఆయన ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *