2026 నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో మద్యం విక్రయాలు సరికొత్త రికార్డు సృష్టించాయి. తెలంగాణలో డిసెంబర్ నెల మొత్తం ఆదాయం రూ. 5,051 కోట్లకు చేరగా, ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే రూ. 2,020 కోట్ల విక్రయాలు జరిగాయి. ఏపీలోనూ గడిచిన మూడు రోజుల్లో రూ. 543 కోట్ల విలువైన మద్యం దుకాణాల ద్వారా అమ్ముడైంది. దేశవ్యాప్త గణాంకాల ప్రకారం, మద్యం అమ్మకాల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలవగా, ఆంధ్రప్రదేశ్ రెండో స్థానానంలో నిలిచింది.
న్యూ ఇయర్ వేడుకల వేళ హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాలైన బెంగళూరు, గుర్గావ్‌లలో యువత మద్యం మత్తులో రోడ్లపై ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. హైదరాబాద్‌లోని పబ్బులు, ఈవెంట్లలో యువతీయువకులు పెద్ద ఎత్తున మద్యం తాగి సందడి చేశారు. జనవరి 1వ తేదీన ఒక్కరోజే తెలంగాణలో దాదాపు రూ. 700 కోట్ల అమ్మకాలు జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రమాదాలను అరికట్టేందుకు పోలీసులు చేపట్టిన తనిఖీల్లో భారీగా కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ ట్రై-కమిషనరేట్ పరిధిలో మొత్తం 2,731 మంది తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. ఇందులో హైదరాబాద్ కమిషనరేట్ 1,198 కేసులతో అగ్రస్థానంలో ఉంది. పట్టుబడిన వారిలో 21-30 ఏళ్ల వయసు గల యువకులే అత్యధికంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
కేవలం మద్యమే కాకుండా మత్తు పదార్థాల వినియోగంపై కూడా పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ‘ఈగల్’ బృందాలు నిర్వహించిన తనిఖీల్లో 89 మందికి పరీక్షలు చేయగా, నలుగురు డీజేలు సహా మొత్తం ఐదుగురికి గంజాయి సేవించినట్లు పాజిటివ్ వచ్చింది. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, పబ్బులు, రిసార్టుల యాజమాన్యాలకు డ్రగ్స్ సరఫరాపై కఠిన హెచ్చరికలు జారీ చేశారు.
