టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా పరోక్ష పోస్టులతో చర్చనీయాంశంగా మారుతున్న ఆమె.. ఈసారి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను ఉద్దేశించి తీవ్రమైన ఆరోపణలు చేశారు. త్రివిక్రమ్ మాట్లాడిన ఓ వీడియో క్లిప్‌పై ఆమె స్పందించిన తీరు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
నూతన సంవత్సరం కానుకగా వెంకటేశ్ నటించిన క్లాసిక్ హిట్ ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రాన్ని ఈరోజు రీ-రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు త్రివిక్రమ్ మాట్లాడుతూ.. “కొన్ని సినిమాలు డబ్బు, పేరు ప్రఖ్యాతలు తెస్తాయి. కానీ, కొన్ని సినిమాలు మాత్రమే గౌరవాన్ని తీసుకొస్తాయి” అని వ్యాఖ్యానించారు. ఈ వీడియో క్లిప్‌ను పలువురు జర్నలిస్టులు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ వీడియోపై పూనమ్ కౌర్ స్పందిస్తూ ఘాటు రిప్లై ఇచ్చారు. “స్త్రీలను మానసిక క్షోభకు గురిచేసి, ఏమీ తెలియనట్టు తప్పించుకోగల అత్యంత దుర్మార్గపు వ్యక్తి అతను” అని పేర్కొన్నారు. అంతేకాకుండా ఇలాంటి వ్యక్తులకు మీడియా మద్దతు ఇవ్వడం వల్లే మహిళలపై వేధింపులు పెరుగుతున్నాయని, ‘మా’ (MAA) అసోసియేషన్ లాంటి పెద్ద సంస్థలు కూడా వీరి బాధ్యతారాహిత్యాన్ని ప్రశ్నించలేకపోతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఒక సాధారణ కామెంట్‌ను పట్టుకుని మీడియా గొప్పగా ప్రచారం చేస్తోందని ఆమె మండిపడ్డారు.
గతంలో కూడా పూనమ్ కౌర్ ‘గురూజీ’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో పరోక్షంగా త్రివిక్రమ్‌ను టార్గెట్ చేస్తూ పోస్టులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అయితే, ఈసారి నేరుగా ఆయన వీడియో కిందే కామెంట్ చేయడంతో ఆమె ఆగ్రహం త్రివిక్రమ్పైనేనని స్పష్టమవుతోంది. ప్రస్తుతం పూనమ్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
