జనవరి 2న కేసీఆర్ అసెంబ్లీకి రావాల్సిందే.. రేవంత్ రెడ్డి బహిరంగ సవాల్

V. Sai Krishna Reddy
2 Min Read

తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కృష్ణా నదిలో కలిపేసింది కేసీఆరేనని, ఆయన పదేళ్ల పాలనలో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై చర్చించేందుకు జనవరి 2 నుంచి అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆదివారం తన నివాసంలో విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన సీఎం.. బీఆర్ఎస్ అధినేతపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ ఒక ‘కరుడుగట్టిన నేరగాడిలా’ అబద్ధాలు ఆడుతున్నారని, ఆయన చేసిన పాపాల వల్లే పాలమూరు, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలు ఎడారిగా మారే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు.

అసెంబ్లీకి రండి.. గౌరవం నేను చూసుకుంటా!

చేతనైతే అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలని కేసీఆర్‌కు రేవంత్ సవాల్ విసిరారు. “ఒకరోజు కృష్ణా జలాలు, మరో రోజు గోదావరిపై చర్చిద్దాం. అసెంబ్లీలో కేసీఆర్ గౌరవానికి భంగం కలగకుండా చూసే బాధ్యత నాది. ఆయన క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారో లేదో సభకు వస్తేనే తెలుస్తుంది. ఆయన రాకుండా తన ‘చెంచాల’ను పంపిస్తే వారితో చర్చించే ప్రసక్తే లేదు” అని స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలో కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను కేవలం 36 శాతానికే (299 టీఎంసీలు) పరిమితం చేస్తూ సంతకం పెట్టింది నిజం కాదా అని ప్రశ్నించారు.

ఏపీ జలదోపిడీకి కేసీఆరే సూత్రధారి

ఏపీ ప్రాజెక్టులను గతంలో కేసీఆర్ సమర్థించిన తీరును రేవంత్ రెడ్డి తన ఫోన్‌లో వీడియోల ద్వారా ప్రదర్శించి చూపారు. పట్టిసీమను అభినందించడం, రాయలసీమకు నీళ్లు తీసుకెళ్లమని చంద్రబాబుకు సలహాలు ఇవ్వడం వెనుక ఉన్న మర్మమేంటని నిలదీశారు. తెలంగాణకు మూతి దగ్గర అందాల్సిన నీళ్లను తోక దగ్గర (రాయలసీమ తర్వాత) తీసుకునేలా ఒప్పందం చేసుకున్నారని, కేవలం పైపులు, కాంట్రాక్టుల కమీషన్ల కోసమే రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. కృష్ణాపై ఉన్న 9 ప్రాజెక్టులను పదేళ్లలో ఒక్కటి కూడా పూర్తి చేయలేకపోయారని ఎద్దేవా చేశారు.

తండ్రీ కొడుకులు ఆర్థిక ఉగ్రవాదులు

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై కేసీఆర్, కేటీఆర్ ‘అత్యాచారం’ చేశారని సీఎం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరినీ ‘ఆర్థిక ఉగ్రవాదులు’గా అభివర్ణిస్తూ.. 12 శాతం వడ్డీకి అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని శిథిలాల కుప్పగా మార్చారని ఆరోపించారు. తమ ప్రభుత్వం వచ్చాక ఆ వడ్డీని 7.1 శాతానికి తగ్గించి, అప్పుల రీస్ట్రక్చరింగ్ ద్వారా ఏటా రూ.4 వేల కోట్లు ఆదా చేస్తోందని వివరించారు. అలాగే, కాళేశ్వరం వైఫల్యాలపై సీబీఐ విచారణకు కేంద్రం సహకరించకపోవడాన్ని బట్టి చూస్తే బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం ఉందని స్పష్టమవుతోందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *