ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా, భారత మార్కెట్లో తన ప్రయాణాన్ని నెమ్మదిగా ప్రారంభించింది. సెప్టెంబర్‌లో డెలివరీలు మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు కేవలం 157 కార్లను మాత్రమే విక్రయించింది. ప్రభుత్వ వాహన్ పోర్టల్ గణాంకాల ప్రకారం నవంబర్ నెలలో కేవలం 48 కార్లను మాత్రమే విక్రయించి, పోటీదారుల కంటే వెనుకబడింది.
భారత లగ్జరీ కార్ల మార్కెట్లో ఇప్పటికే పట్టు సాధించిన బీఎండబ్ల్యూ, నవంబర్‌లో ఏకంగా 267 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించింది. ఈ గణాంకాలు టెస్లా ఎదుర్కొంటున్న తీవ్రమైన పోటీని స్పష్టం చేస్తున్నాయి. అమెరికాకు చెందిన ఈ సంస్థ, ‘మోడల్ వై’ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీతో భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఆరంభంలో భారీ అంచనాలు ఉన్నప్పటికీ, అమ్మకాల సంఖ్య ఆశించిన స్థాయిలో లేదు.
అయితే, అమ్మకాలు నెమ్మదిగా ఉన్నప్పటికీ టెస్లా తన విస్తరణ ప్రణాళికలను వేగవంతం చేస్తోంది. గతవారం గురుగ్రామ్‌లోని ఆర్కిడ్ బిజినెస్ పార్క్‌లో మొట్టమొదటి ‘ఆల్-ఇన్-వన్ టెస్లా సెంటర్’ను ప్రారంభించింది. ఇక్కడే రిటైల్, సర్వీస్, డెలివరీ, ఛార్జింగ్ సదుపాయాలను ఒకేచోట అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
టెస్లా ఇండియా జనరల్ మేనేజర్ శరద్ అగర్వాల్ మాట్లాడుతూ, ఉత్తర భారతంలో టెస్లా కమ్యూనిటీకి మద్దతుగా ఈ సెంటర్ ఉపయోగపడుతుందని తెలిపారు. ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం ద్వారా వినియోగదారుల్లో నమ్మకాన్ని పెంచి, ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించడమే తమ లక్ష్యమని ఆయన వివరించారు. ఈ కొత్త సెంటర్లో మోడల్ వై టెస్ట్ డ్రైవ్ చేయడంతో పాటు అత్యాధునిక V4 సూపర్ ఛార్జర్లను, కంపెనీకి చెందిన హ్యూమనాయిడ్ రోబోట్ ‘ఆప్టిమస్ జెన్ 2’ను కూడా ప్రదర్శనకు ఉంచారు.
