బీహార్ లో రాహుల్ యాత్ర చేపట్టిన 110 నియోజకవర్గాల్లో మహా కూటమి వెనుకంజ

V. Sai Krishna Reddy
1 Min Read

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి, ప్రత్యేకించి ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి భారీ షాక్ ఇచ్చాయి. బీజేపీ ఓట్లను దొంగిలిస్తోందంటూ రాహుల్ చేపట్టిన ‘ఓటర్ అధికార్ యాత్ర’ పూర్తిగా విఫలమైంది. పోటీ చేసిన 61 స్థానాల్లో కాంగ్రెస్ కేవలం 4 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో నిలిచింది.

 

ఈ ఏడాది ఆగస్టులో రాహుల్ గాంధీ ‘ఓటర్ అధికార్ యాత్ర’ ప్రారంభించారు. సుమారు 1,300 కిలోమీటర్ల మేర 25 జిల్లాల్లోని 110 నియోజకవర్గాల గుండా ఈ యాత్ర సాగింది. అయితే, యాత్ర సాగిన ఒక్క నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్‌కు అనుకూల పవనాలు వీయకపోవడం గమనార్హం. గతంలో రాహుల్ చేపట్టిన ‘భారత్ జోడో’ యాత్ర 2023 తెలంగాణ, 2024 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి మేలు చేశాయని భావించినప్పటికీ, బీహార్‌లో ఆ మ్యాజిక్ పనిచేయలేదు.

మరోవైపు, ఎన్డీయే కూటమి ఈ ఎన్నికల్లో విజయదుందుభి మోగించింది. బీజేపీ 91, జేడీయూ 80 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కూటమిలోని ఇతర పార్టీలైన చిరాగ్ పాశ్వాన్ ఎల్జేపీ (22), జితన్ రామ్ మాంఝీ హ్యామ్ (5), ఉపేంద్ర కుష్వాహ ఆర్ఎల్ఎం (3) కూడా అద్భుత ఫలితాలను రాబడుతున్నాయి.

ఎన్నికల జాబితా సవరణల పేరుతో బీజేపీ ఓట్లను తొలగిస్తోందన్న రాహుల్ ఆరోపణలను బీహార్ ఓటర్లు విశ్వసించలేదని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. దీనికి తోడు, మహాఘట్‌బంధన్‌లో ఐక్యత లేకపోవడం, తేజస్వి యాదవ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించడంలో కాంగ్రెస్ సంశయించడం, ఉమ్మడి ప్రచార వ్యూహం కొరవడటం వంటి అంశాలు కూడా ఓటమికి ప్రధాన కారణాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు. యాత్రతో కార్యకర్తల్లో వచ్చిన ఉత్సాహం ప్రచారం ముగిసేనాటికి నీరుగారిపోయింది

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *