ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన భారీ పేలుడు ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. హ్యుందాయ్ ఐ20 కారులో పేలుడు సంభవించిందని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈరోజు సాయంత్రం ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలోని సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారులో పేలుడు సంభవించిందని తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ పేలుడు ఘటనలో కొంతమంది ప్రాణాలు కోల్పోయారని, మరికొంతమంది గాయపడ్డారని, కొన్ని వాహనాలు దెబ్బతిన్నాయని తెలిసిందని అన్నారు.
పేలుడు సమాచారం అందిన వెంటనే ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్, ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ బృందాలు 10 నిమిషాల్లోనే సంఘటన స్థలానికి చేరుకున్నాయని ఆయన తెలిపారు. ఎఫ్ఎస్ఎల్, ఎన్ఎస్జీ, ఎన్ఐఏ బృందాలు సంఘటన స్థలానికి వెళ్లి సమగ్ర దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు. సమీపంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తారని వెల్లడించారు. తాను ఢిల్లీ నగర పోలీస్ కమిషనర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్ఛార్జ్తో మాట్లాడానని, వారు ఇంకా సంఘటన స్థలంలోనే ఉన్నారని తెలిపారు.
అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు చేస్తామని అమిత్ షా పేర్కొన్నారు. ఈ పేలుడుకు సంబంధించిన కారణాలను ప్రజల ముందు ఉంచుతామని అన్నారు. పేలుడు జరిగిన ప్రాంతానికి తాను వెళుతున్నానని, ఆసుపత్రిని కూడా సందర్శించి క్షతగాత్రులను పరామర్శిస్తానని అమిత్ షా తెలిపారు
