దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుటుంబంలో వారసత్వ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఆయనకు అసలైన వారసులం తామేనంటూ మొదటి భార్య మాలినిదేవి, కుమారుడు తారక్ ప్రద్యుమ్న రంగంలోకి దిగడంతో వివాదం కొత్త మలుపు తిరిగింది. ఈ వ్యవహారంపై శేరిలింగంపల్లి తహసీల్దార్ గురువారం విచారణ చేపట్టారు. గతంలో గోపీనాథ్ రెండో భార్య సునీత, ఆమె పిల్లలకు జారీ చేసిన లీగల్ హెయిర్ సర్టిఫికెట్‌ను తాత్కాలికంగా పక్కనపెట్టి, ఇరుపక్షాలకు నోటీసులు జారీ చేశారు.
విచారణకు గోపీనాథ్ మొదటి భార్య మాలినీదేవి, కుమారుడు తారక్‌తో పాటు గోపీనాథ్ తల్లి మహానందకుమారి కూడా హాజరయ్యారు. ఆమె తన కోడలు మాలినీదేవికి మద్దతుగా నిలిచారు. రెండో భార్య సునీత తరఫున ఆమె కుమార్తె దిశిర, న్యాయవాది హాజరయ్యారు. ఇరుపక్షాల వాదనలు విన్న తహసీల్దార్ వెంకారెడ్డి, వారి వద్ద ఉన్న ఆధారాలను స్వీకరించారు. మరిన్ని పత్రాలు సమర్పించేందుకు గడువు కావాలని ఇరువర్గాలు కోరడంతో, ఈ నెల 19వ తేదీలోగా వాటిని అందించాలని ఆదేశించారు. తదుపరి విచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేశారు.
గోపీనాథ్ మృతి ఒక మిస్టరీ: తల్లి మహానందకుమారి
ఈ సందర్భంగా గోపీనాథ్ తల్లి మహానందకుమారి సంచలన వ్యాఖ్యలు చేశారు. “1998లోనే మాలినితో గోపీనాథ్‌కు వివాహమైంది. ఆమే మొదటి భార్య. మాలినితో విడాకుల పిటిషన్ కూడా రద్దయింది. గోపీనాథ్ చావు ఒక మిస్టరీ. ఆయన ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై ఉన్నాడని చెప్పి నన్ను చూడనివ్వలేదు. కేటీఆర్ వచ్చేవరకూ మరణవార్తను ధ్రువీకరించలేదు. ఎందుకు అలా చేశారో కేటీఆరే జవాబు చెప్పాలి. కొడుకుగా ప్రద్యుమ్నకు అన్ని హక్కులు దక్కాలి” అని ఆమె పేర్కొన్నారు.
రావొద్దని బెదిరించారు: కుమారుడు తారక్
గోపీనాథ్ కుమారుడు తారక్ ప్రద్యుమ్న మాట్లాడుతూ.. “నాన్న నాతో టచ్‌లోనే ఉండేవారు. ఆయన మరణవార్త తెలిసి అమెరికా నుంచి రావాలనుకున్నా. కానీ, వస్తే గొడవలు జరుగుతాయని, రావొద్దని బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు బెదిరించారు. అందుకు సంబంధించిన కాల్ లాగ్స్ నా దగ్గర ఉన్నాయి. నాన్న అంత్యక్రియలు గౌరవంగా జరగాలనే ఉద్దేశంతోనే ఆగాను. నా పాస్‌పోర్ట్, ఇతర పత్రాల్లో తండ్రిగా గోపీనాథ్ పేరే ఉంది. మమ్మల్ని కొన్ని నెలలుగా మానసికంగా వేధిస్తున్నారు” అని ఆరోపించారు. తాము చట్టప్రకారం విడాకులు తీసుకోలేదని మాలినీదేవి స్పష్టం చేశారు.
ఎన్నికల ముందు రాజకీయ కుట్ర: సునీత వర్గం
ఈ ఆరోపణలను సునీత కుటుంబం ఖండించింది. “గత 25 ఏళ్లుగా గోపీనాథ్‌తో సునీత కలిసే ఉన్నారు. ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు సమర్పించిన అఫిడవిట్లలో భార్యగా సునీత పేరు, వారి పిల్లల పేర్లే ఉన్నాయి. బ్యాంకు, పాలసీ నామినీగా కూడా సునీతనే ఉన్నారు. ఇన్నాళ్లూ లేని వివాదం సరిగ్గా ఎన్నికల ముందు రావడం రాజకీయ కుట్రలో భాగమే. ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి వంటి పెద్దలందరూ సునీత కుటుంబాన్నే పరామర్శించారు. వారి దగ్గర సరైన ఆధారాలు లేవు” అని సునీత తరఫు వారు వాదిస్తున్నారు. తదుపరి విచారణలో సమర్పించే ఆధారాలను బట్టి తహసీల్దార్ తుది నిర్ణయం తీసుకోనున్నారు.
