రక్త ధాతలుగా… రక్షక భటులు 
పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా రక్తదాన శిబిరం ఏర్పాటు
మిర్యాలగూడ, అక్టోబర్ 29,( ప్రజాజ్యోతి ): ఖాకీ గుండెల మాటున కరకు ధనమే కాదు.. సామాజిక శ్రేయస్సుకు పాటుపడే గుణం ఉందంటూ చాటారు మిర్యాలగూడ పోలీసులు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా డిఎస్పీకే రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ప్రజారక్షణలో నిరంతరం పనిచేసే పోలీసులు విధి నిర్వహణతో పాటు రక్తదానం చేసి, మరికొందరికి ప్రాణదాతలుగా మారటానికి సిద్ధమయ్యారు. వారి స్ఫూర్తి కి తాము కూడా సై అంటూ యువకులు తరలివచ్చి రక్తదానం చేశారు. సబ్ డివిజన్ పరిధిలోని సిఐలు ఎస్ఐలు సిబ్బంది పలువురు ఉత్సాహంగా రక్తదానాన్ని చేశారు. ఈ సందర్భంగా డి.ఎస్.పి కె. రాజశేఖర్ రాజు మాట్లాడుతూ విధి నిర్వహణలో ఎందరో పోలీస్ అమరులు తమ ప్రాణాలను పణంగా పెట్టారని, ఉద్యోగ బాధ్యతలు వారు చూపిన స్ఫూర్తితో ప్రతి పోలీస్ అంకితభావంతో పని చేయాలన్నారు. విధి నిర్వహణతో పాటు సామాజిక సేవ కు కూడా ముందుకు వచ్చిన పోలీసులను, యువకులను అభినందించారు. రక్తదానం చేయటం అంటే మరొకరికి ప్రాణదానం చేయడమని అన్నారు. రక్తదానంలో పాల్గొన్న పోలీస్ అధికారులు, సిబ్బందికి,యువకులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ పి ఎన్ డి ప్రసాద్, వన్ టౌన్,టూ టౌన్ సిఐలు నాగభూషణరావు, జెట్టి సోమ నరసయ్య, ఎస్సైలు ఏ సైదిరెడ్డి, బి రాంబాబు, ఎం లక్ష్మయ్య, కృష్ణయ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
					