మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి. హరీశ్ రావు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి సత్యనారాయణ రావు (95) మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ వార్త తెలియగానే ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా సంతాప సందేశాన్ని విడుదల చేసింది. “మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యుడు టీ హరీశ్ రావు గారి తండ్రి సత్యనారాయణ రావు గారి మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు తీవ్ర సంతాపం తెలిపారు. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించారు. హరీశ్ రావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు” అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
సత్యనారాయణ రావు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. ఆయన మరణవార్త తెలియగానే బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావుతో పాటు పలువురు పార్టీ నేతలు, వివిధ పార్టీలకు చెందిన రాజకీయ ప్రముఖులు, కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు. హరీశ్ రావు నివాసానికి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు పలువురు నేతలు సిద్ధమవుతున్నారు.
సత్యనారాయణ రావు అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
