దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) శ్రీకారం చుట్టనుంది. ఇందుకు సంబంధించిన ‘ప్రత్యేక సవరణ’ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమాన్ని నేటి సాయంత్రం ప్రకటించే అవకాశం ఉంది. ఈ మేరకు సాయంత్రం 4:15 గంటలకు ఈసీ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.
ఎన్నికల సంఘం మీడియాకు పంపిన ఆహ్వానంలో కేవలం ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు మాత్రమే పేర్కొంది. అయితే, ఇది పూర్తిగా ఓటర్ల జాబితాల సవరణకు సంబంధించిన ప్రకటనకేనని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాను నూటికి నూరు శాతం కచ్చితత్వంతో సిద్ధం చేసే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.
తొలి దశలో భాగంగా 10 నుంచి 15 రాష్ట్రాల్లో ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని ప్రకటించవచ్చని తెలుస్తోంది. ముఖ్యంగా 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు ఇందులో ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
వచ్చే ఏడాది (2026) తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అసోం, పుదుచ్చేరి రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాను పక్కాగా సిద్ధం చేసేందుకు ఎన్నికల సంఘం ఈ సవరణ ప్రక్రియను మొదటగా చేపట్టనుంది. ఈ ప్రకటనతో ఎన్నికల సందడి మొదలైనట్టేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
