మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం పేట్‌బషీరాబాద్‌లో జర్నలిస్టులకు కేటాయించిన విలువైన ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టారు. సర్వే నంబర్ 25/2లో ఉన్న 38 ఎకరాల స్థలం చుట్టూ హైడ్రా బుధవారం కంచె ఏర్పాటు చేసింది. అక్రమ కట్టడాలు, కబ్జాలు పెరిగిపోతున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా రంగంలోకి దిగింది.
ఈ 38 ఎకరాల భూమిని 2008లో రాష్ట్ర ప్రభుత్వం జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి కేటాయించింది. అప్పటి నుంచి ఈ భూమి హెచ్‌ఎండీఏ పరిధిలో ప్రభుత్వ అధీనంలోనే ఉంది. అయితే, ఈ కేటాయింపులపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీ ప్రక్రియ నిలిచిపోయింది. కోర్టులో కేసు విచారణలో ఉండగానే, ఈ ఖాళీ స్థలంలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని జర్నలిస్టుల సొసైటీ ప్రతినిధులు, రెవెన్యూ, హెచ్‌ఎండీఏ అధికారులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదులపై స్పందించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు రెవెన్యూ, మున్సిపల్, హెచ్‌ఎండీఏ అధికారులతో కూడిన బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి, ఆక్రమణలు నిజమేనని నిర్ధారించుకుంది. దీంతో, ఇప్పటికే నిర్మాణాలు పూర్తి చేసుకుని నివాసం ఉంటున్న ఇళ్లను మినహాయించి, మిగిలిన ఖాళీ స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేశారు.