ప్రపంచ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ, భారత స్టాక్ మార్కెట్లు ఈరోజు ట్రేడింగ్‌ను భారీ లాభాలతో ప్రారంభించాయి. ముఖ్యంగా ఐటీ షేర్లలో వెల్లువెత్తిన కొనుగోళ్ల మద్దతుతో సూచీలు ఉత్సాహంగా కదిలాయి. భారత్, అమెరికా మధ్య త్వరలో వాణిజ్య ఒప్పందం కుదరవచ్చన్న సానుకూల అంచనాలు మదుపరులలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి.
ట్రేడింగ్ ప్రారంభంలో బీఎస్ఈ సెన్సెక్స్ 727.81 పాయింట్లు పెరిగి 85,154.15 వద్దకు చేరుకుంది. అలాగే, ఎన్ఎస్ఈ నిఫ్టీ 188.6 పాయింట్లు లాభపడి కీలకమైన 26,000 మార్కును అధిగమించి 26,057.20 వద్ద ట్రేడ్ అవుతోంది. మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం, నిఫ్టీకి తక్షణ లక్ష్యం 26,186 వద్ద ఉందని, ఆశావాహ దృక్పథంతో 26,800 స్థాయికి చేరే అవకాశం ఉందని తెలిపారు. అయితే, 25,780 వద్ద మద్దతు ఉందని, మార్కెట్ ఒక్కసారిగా పడిపోయే అవకాశాలు తక్కువని వారు విశ్లేషించారు.
రంగాలవారీగా చూస్తే, నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 1.84 శాతం లాభంతో టాప్ గెయినర్‌గా నిలిచింది. బీఎస్ఈలో ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్‌టెక్, టెక్ మహీంద్రా వంటి ఐటీ దిగ్గజాల షేర్లలో బలమైన కొనుగోళ్లు కనిపించాయి. మరోవైపు, నిఫ్టీ రియల్టీ సూచీ స్వల్పంగా 0.08 శాతం నష్టపోయింది. బజాజ్ ఫిన్‌సర్వ్, మారుతీ, పవర్ గ్రిడ్ వంటి షేర్లు నష్టాల్లో పయనించాయి.
ప్రధాన సూచీలతో పాటు బ్రాడర్ మార్కెట్లు కూడా లాభాల్లోనే ఉన్నాయి. నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 ఇండెక్స్ 0.33 శాతం, నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ 0.44 శాతం మేర పెరిగాయి. ఇదిలా ఉండగా, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) అక్టోబర్ 21న వరుసగా ఐదో రోజు కొనుగోళ్లు జరిపారు. ఆ రోజు వారు రూ. 96 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేయడం మార్కెట్ సెంటిమెంట్‌కు మరింత బలాన్నిచ్చింది.