తెలంగాణలో 2025–27 సంవత్సరాలకు గాను ప్రభుత్వం ప్రకటించిన నూతన మద్యం పాలసీ విషయంలో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది. ఇది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని, ఇందులో న్యాయస్థానం జోక్యం చేసుకోలేదని స్పష్టం చేసింది. మద్యం దుకాణాల లైసెన్సుల కేటాయింపు ప్రక్రియపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న అభ్యర్థనను తోసిపుచ్చింది.
ప్రభుత్వం ఆగస్టు 14న జారీ చేసిన నూతన మద్యం పాలసీని సవాలు చేస్తూ సికింద్రాబాద్‌కు చెందిన గడ్డం అనిల్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. మద్యం దుకాణాల కోసం దరఖాస్తు రుసుముగా రూ. 3 లక్షలు నాన్-రిఫండబుల్ పద్ధతిలో వసూలు చేయడాన్ని పిటిషనర్ తరఫు న్యాయవాది తప్పుబట్టారు. నామమాత్రపు రుసుము, ఈఎండీ (ఎర్నెస్ట్ మనీ డిపాజిట్) విధానాన్ని అమలు చేయాలని కోరారు. అలాగే, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ ప్రయోజనాలతో పాటు కల్లుగీత కార్మికుల కోసం ప్రత్యేక పన్నుల విధానం ఉండాలని వాదించారు.
గతంలో 2023-25 టెండర్లలో లైసెన్సు పొందలేకపోవడం వల్ల తాను డిపాజిట్ చేసిన డబ్బును నష్టపోయానని పిటిషనర్ కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలో, కేసులో తుది తీర్పు వెలువడే వరకు దుకాణాల కేటాయింపు ప్రక్రియను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించారు.
ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, పిటిషనర్ అభ్యర్థనను తిరస్కరించారు. నాన్-రిఫండబుల్ దరఖాస్తు రుసుము ఇష్టం లేని వారు దరఖాస్తు చేసుకోకుండా ఉండే స్వేచ్ఛ వారికి ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మధ్యంతర ఉపశమనం కల్పించేందుకు నిరాకరిస్తూ, కౌంటర్ దాఖలు చేయాలని ఎక్సైజ్ శాఖ, కమిషనర్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 3వ తేదీకి వాయిదా వేసింది. కాగా, మద్యం లైసెన్సుల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ అక్టోబర్ 18 వరకు కొనసాగనుంది.