హర్యానా జైళ్ల శాఖ ఐజీ, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ పూరన్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. గత మంగళవారం ఆయన తన నివాసంలో రివాల్వర్ తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. హర్యానా డీఐజీ, రోహ్ తక్ ఎస్పీ సహా పలువురు ఉన్నతాధికారులు తనను వేధిస్తున్నారని, కులవివక్షతో తప్పుడు కేసులో ఇరికించారని పూరన్ కుమార్ తన సూసైడ్ లెటర్ లో పేర్కొన్నారు. పూరన్ భార్య, ఐఏఎస్ ఆఫీసర్ అమ్ నీత్ తనకు న్యాయం చేయాలంటూ హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీకి విజ్ఞప్తి చేశారు. తన భర్త మృతికి కారణమైన ఉన్నతాధికారులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు తన భర్త మృతదేహానికి పోస్ట్ మార్టం చేయనివ్వబోనని స్పష్టం చేశారు. దీంతో ఐపీఎస్ పూరన్ కుమార్ మృతదేహం ఏడు రోజులుగా చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఆస్పత్రి మార్చురీలోనే ఉండిపోయింది.
పూరన్ కుమార్ ఆత్మహత్యపై హర్యానా ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. డీజీపీ శత్రుజీత్ కపూర్ ను దీర్ఘకాలిక సెలవుపై పంపించడంతో పాటు రోహ్ తక్ ఎస్పీ నరేంద్ర బైజర్నియాను సస్పెండ్ చేసింది. అయితే, ఈ చర్యలపై పూరన్ కుటుంబ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌లోని కఠిన సెక్షన్ల కింద కేసు పెట్టాలని, డీఐజీని, ఎస్పీని అరెస్టు చేయాలని పట్టుబడుతున్నారు. ఐపీఎస్ పూరన్కుమార్ సూసైడ్ కేసుపై దళిత సంఘాలకు చెందిన 31 మంది సభ్యులతో ఏర్పాటైన కమిటీ ఆదివారం చండీగఢ్‌లో ‘దళిత మహాపంచాయత్’ సమావేశం నిర్వహించింది. పూరన్ ఫ్యామిలీకి దళిత మహాపంచాయత్ నేతలు కూడా మద్దతుగా నిలిచారు. నిందితులపై 48 గంటల్లోపు చర్యలు తీసుకోకపోతే దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతామని అల్టిమేటం జారీ చేశారు.
పూరన్ కు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి నివాళి
హైదరాబాద్ బర్కత్ పురకు చెందిన పూరన్ కుమార్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదివారం చండీగఢ్ వెళ్లి ఐపీఎస్ పూరన్ కుమార్ మృతదేహానికి నివాళి అర్పించారు. భట్టి విక్రమార్కతో పాటు తెలంగాణ డీఐజీ సహా 8 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులు వెళ్లారు.