ఒక్క గ్రామం నుంచి 200 కుటుంబాలు.. ఊళ్లకు ఊళ్లు వీడుతున్న పల్లె జనం

V. Sai Krishna Reddy
2 Min Read

కర్నూలు జిల్లాలోని పల్లె సీమలు ఖాళీ అవుతున్నాయి. పనుల్లేక, పండిన పంటకు గిట్టుబాటు ధర రాక జనం పొట్ట చేతబట్టుకుని పొరుగు ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. వలసల తీవ్రత ఎంతలా ఉందంటే, కోసిగి మండలం చింతకుంట గ్రామం నుంచి ఒక్కరోజులోనే 200కు పైగా కుటుంబాలు ఊరు విడిచి వెళ్లాయి. వారిలో 25 మంది పాఠశాల విద్యార్థులు కూడా ఉండటం పరిస్థితికి అద్దం పడుతోంది. కేవలం చింతకుంటలోనే కాక, జిల్లాలోని అనేక గ్రామాలు నేడు ఇదే దయనీయ స్థితిలో ఉన్నాయి.

పెట్టుబడి రాక.. పెరిగిన వలస
ఈ ఏడాది జిల్లాలో 5.62 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేసినా, అధిక వర్షాల కారణంగా పంట పూర్తిగా దెబ్బతింది. కాయలు చెట్టుపైనే కుళ్లిపోయి, మొలకలు రావడంతో రైతులు ఎకరాకు నాలుగైదు క్వింటాళ్ల దిగుబడిని కోల్పోయారు. స్థానికంగా పత్తి తీతకు వెళ్లినా రోజుకు రూ. 300-400 మించి కూలీ రావడం లేదు. మరోవైపు, ఆరు నెలలుగా ఉపాధి హామీ పథకం డబ్బులు కూడా అందకపోవడంతో పేదలకు పూట గడవడం కష్టంగా మారింది.

ఇదే సమయంలో తెలంగాణలోని మహబూబ్‌నగర్‌, వికారాబాద్‌ జిల్లాలతో పాటు ఏపీలోని గుంటూరులో కిలో పత్తి తీస్తే రూ. 15 నుంచి రూ. 18 వరకు కూలీ లభిస్తోంది. దీంతో దంపతులిద్దరూ కష్టపడితే రోజుకు రూ. 1,500 వరకు, పిల్లలు కూడా తోడైతే రూ. 2,500 వరకు సంపాదించే అవకాశం ఉంది. ఈ లెక్కన నెలకు రూ. 50 వేలకు పైగా ఆదాయం వస్తుండటంతో కుటుంబాలతో సహా అక్కడికి తరలిపోతున్నారు. గుంటూరులో పత్తి పనులు ముగియగానే మిరప కోతలు మొదలవడంతో దాదాపు నాలుగైదు నెలల పాటు ఉపాధి లభిస్తుందని వలస కూలీలు చెబుతున్నారు.

ఆస్తి ఉన్నా తీరని కష్టాలు
చింతకుంటకు చెందిన పుసులు యల్లప్ప, పద్మ దంపతుల కథ ఈ వలసల వెనుక ఉన్న విషాదాన్ని తెలియజేస్తుంది. వారికి ఆరెకరాల పొలం ఉన్నప్పటికీ, రూ. 4 లక్షలకు పైగా అప్పు చేసి పత్తి, ఉల్లి సాగు చేశారు. ధరలు లేక ఉల్లిని పొలంలోనే వదిలేయగా, వర్షాలకు పత్తి పంట నాశనమైంది. చేసిన అప్పులు తీర్చే దారిలేక, బడికెళ్లే ఇద్దరు పిల్లలను తీసుకుని వికారాబాద్‌కు వలస వెళ్తున్నానని యల్లప్ప తన ఆవేదన వ్యక్తం చేశారు.

మంత్రాలయం, ఎమ్మిగనూరు, ఆదోని వంటి నియోజకవర్గాల నుంచి ఇప్పటికే పదివేల కుటుంబాలు వలస వెళ్లినట్లు అనధికారిక అంచనా. పశ్చిమ కర్నూలు వలసలకు అడ్డుకట్ట వేయాలంటే వేదవతి, ఆర్డీఎస్‌, గుండ్రేవుల వంటి సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడమే ఏకైక మార్గమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం ఈ ప్రాజెక్టులపై దృష్టి సారిస్తేనే ఈ ప్రాంత ప్రజల తలరాతలు మారతాయని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *