బీజేపీలో బి–ఫారంల గొడవ
హుజురాబాద్లో బండి–ఈటల వర్గ పోరు మళ్లీ బహిర్గతం!
కరీంనగర్, సెప్టెంబర్ 11, (ప్రజాజ్యోతి)
బీజేపీ బి–ఫారంల పంచాయతీ మరోసారి బహిర్గతమైంది. కరీంనగర్ బీజేపీలో అంతర్గత వర్గ పోరు మళ్లీ తెరపైకి వచ్చింది. హుజురాబాద్లో మాజీ మంత్రి, ఎంపీ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు, కేంద్రమంత్రి బండి సంజయ్ అనుచరుల కౌంటర్లతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.శుక్రవారం హుజురాబాద్లో జరిగిన సమావేశంలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ,
“25 ఏళ్లుగా నేను ఇక్కడ నాయకుడిని… మేమే బి–ఫారంలు ఇస్తాం. మేము ఇవ్వకుండా ఎవరు ఇస్తారు?” అని బహిరంగంగా ప్రకటించారు.
ఈ వ్యాఖ్యలు బయటకు రావడంతో బీజేపీ అంతర్గత విభేదాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి.దీనికి ప్రతిస్పందనగా, బండి సంజయ్ ప్రధాన అనుచరుడు, కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు.
“బీజేపీలో ఒక్క వ్యక్తి ఇష్టం చాలు అనే వ్యవస్థ లేదు. వర్గాల ఆధారంగా టికెట్లు పంచే సంప్రదాయం మా పార్టీకి లేదు” అని ఆయన స్పష్టం చేశారు.ఇద్దరి మధ్య ఈ వ్యాఖ్యల యుద్ధం, బీజేపీలో ఆధిపత్య పోరు మరోసారి తెరపైకి తెచ్చింది.
ఒకవైపు బండి సంజయ్ శిబిరం, మరోవైపు ఈటల రాజేందర్ శిబిరం మధ్య కొనసాగుతున్న ఈ తగువుతో కరీంనగర్ బీజేపీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నాయి.ఎన్నికల వేళ టికెట్ల కేటాయింపుపై చర్చ మొదలవకముందే బి–ఫారంల పంచాయతీ బీజేపీని మళ్లీ చీల్చే సూచనలు కనిపిస్తున్నాయి.