బంగారంపై రుణాలు తీసుకునే వారికి ముఖ్య గమనిక. ఇప్పటివరకు ఉన్నట్లుగా ఏడాది చివరిలో వడ్డీ చెల్లించే వెసులుబాటుకు కొన్ని బ్యాంకులు స్వస్తి పలుకుతున్నాయి. ఇకపై ప్రతినెలా తప్పనిసరిగా వడ్డీ చెల్లించాలంటూ కొత్త నిబంధనను అమలు చేస్తున్నాయి. బంగారం ధరలు పెరగడంతో రుణ ఎగవేతలు భారీగా పెరిగిపోవడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.
ఎందుకీ మార్పు?
దేశంలో బంగారం ధరలు ఆకాశాన్నంటున్నాయి. దీంతో తక్కువ బంగారంపై ఎక్కువ రుణం పొందే అవకాశం పెరిగింది. ఇది ప్రజలను బాగా ఆకర్షిస్తోంది. ఇతర రుణాలతో పోలిస్తే 9 శాతం లోపు వడ్డీకే రుణం లభించడంతో గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా బంగారం రుణాలు 26 శాతం పెరిగాయి. అయితే, రుణం తీసుకున్నవారు ఏడాదిలోగా తిరిగి చెల్లించడంలో విఫలమవుతున్నారు. ఈ కారణంగా గోల్డ్ లోన్ విభాగంలో మొండి బకాయిలు (NPA) 30 శాతానికి పైగా పెరిగాయి. ఈ సమస్యను అధిగమించేందుకే బ్యాంకులు వడ్డీ వసూలు విధానంలో మార్పులు చేశాయి.
వడ్డీ కట్టకపోతే సిబిల్‌పై దెబ్బ
కొత్త నిబంధన ప్రకారం ప్రతినెలా వడ్డీ చెల్లించకపోతే దాని ప్రభావం నేరుగా కస్టమర్ సిబిల్ స్కోర్‌పై పడుతుందని బ్యాంకులు స్పష్టం చేస్తున్నాయి. సిబిల్ స్కోర్ తగ్గితే భవిష్యత్తులో ఇతర ఏ లోన్లు పొందాలన్నా కష్టమవుతుంది. ఖాతాదారుడి ఆర్థిక పరిస్థితిని బట్టే ఈ నిబంధనలను అమలు చేస్తున్నామని బ్యాంక్ అధికారులు చెబుతున్నారు.
తులానికి లక్ష వరకు లోన్
ప్రస్తుతం పది గ్రాముల బంగారంపై సుమారు లక్ష రూపాయల వరకు రుణం ఇస్తున్నామని ఓ ప్రభుత్వ రంగ బ్యాంకు అధికారి తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన కవిత, రాజశేఖర్ దంపతులు మాట్లాడుతూ.. “గతంలో లక్ష రూపాయలకు కొన్న నాలుగు తులాల గాజులపై ఇటీవలే బ్యాంకులో రూ. 3.50 లక్షల రుణం మంజూరైంది. గంటన్నరలోనే డబ్బులు ఖాతాలో జమ కావడం ఆశ్చర్యం కలిగించింది” అని తెలిపారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మార్గదర్శకాల ప్రకారం, బంగారం విలువలో రూ. 2.50 లక్షల లోపు రుణానికి 85శాతం, రూ. 5 లక్షల లోపు రుణానికి 80శాతం, ఆపైన రుణానికి 75 శాతం మాత్రమే ఇవ్వాలి. ప్రభుత్వ బ్యాంకులు ఈ నిబంధనలు పాటిస్తున్నా, కొన్ని ప్రైవేట్ ఆర్థిక సంస్థలు మాత్రం పరిమితికి మించి రుణాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది.