దేశంలో క్రిప్టోకరెన్సీ భవిష్యత్తుపై కేంద్ర ప్రభుత్వం మరోసారి తన వైఖరిని స్పష్టం చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) లేదా దేశీయ కరెన్సీ వంటి ఎలాంటి ఆధారం లేని ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలను తాము ప్రోత్సహించబోమని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తేల్చిచెప్పారు. దీనికి ప్రత్యామ్నాయంగా ఆర్‌బీఐ గ్యారెంటీతో కూడిన అధికారిక డిజిటల్ కరెన్సీని త్వరలోనే తీసుకురానున్నట్లు ప్రకటించారు.
దోహాలో పర్యటిస్తున్న సందర్భంగా పీయూష్ గోయల్ మాట్లాడుతూ “ఎలాంటి సార్వభౌమ లేదా ఆస్తిపరమైన మద్దతు లేని క్రిప్టోకరెన్సీలను మేం ప్రోత్సహించడం లేదు. ప్రజలు నష్టపోకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. అందుకే వాటిపై నిషేధం విధించకపోయినా, వాటి వినియోగాన్ని నిరుత్సాహపరిచేందుకు భారీగా పన్నులు వేస్తున్నాం” అని వివరించారు.
భారత ప్రభుత్వం తీసుకురాబోయే డిజిటల్ కరెన్సీ ప్రయోజనాల గురించి ఆయన వివరిస్తూ “ఆర్‌బీఐ హామీతో రానున్న ఈ డిజిటల్ కరెన్సీ ద్వారా లావాదేవీలు మరింత సులభతరం అవుతాయి. కాగితం వాడకం గణనీయంగా తగ్గుతుంది. ప్రస్తుత బ్యాంకింగ్ వ్యవస్థ కన్నా వేగంగా, పారదర్శకంగా లావాదేవీలు జరపవచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా, ప్రతి లావాదేవీని గుర్తించే సౌలభ్యం ఉంటుంది” అని తెలిపారు.
ఖతార్‌తో వాణిజ్య ఒప్పందంపై చర్చలు
ఇదే పర్యటనలో భాగంగా భారత్, ఖతార్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను విస్తరించే లక్ష్యంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై చర్చలు జరిపినట్లు గోయల్ వెల్లడించారు. ఖతార్ వాణిజ్య మంత్రితో జరిపిన సమావేశంలో ఈ చర్చలను వేగవంతం చేయాలని ఇరు దేశాలు అంగీకరించినట్లు తెలిపారు. “వచ్చే ఏడాది మధ్య నాటికి లేదా మూడో త్రైమాసికం లోపు ఈ ఒప్పందాన్ని ఖరారు చేయగలమని భావిస్తున్నాం” అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇరు దేశాల మధ్య వాణిజ్యం 14.15 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ ఒప్పందం ద్వారా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇప్పటికే యూఏఈతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్న భారత్, త్వరలో ఒమన్‌తో కూడా ఇలాంటి ఒప్పందంపై సంతకం చేయనుంది.