సాధారణంగా ఏ సినిమాలో నైనా ప్రీ క్లైమాక్స్ దగ్గర నుంచి కథ మరింత వేగాన్ని పుంజుకుంటుంది .. అనూహ్యమైన మలుపులు తీసుకుంటుంది. ఇక్కడి నుంచి కథ మరింత పట్టుగా .. పకడ్బందీగా నడుస్తూ ఉంటుంది. అందువలన ప్రేక్షకులు మరింత శ్రద్ధపెట్టి అలా కథను ఫాలో అవుతూ ఉంటారు. క్లైమాక్స్ లో కథ అనేక విశేషాలు .. విన్యాసాలు చేస్తూ చివరికి ప్రేక్షకులకు సంతృప్తిని కలిగిస్తూ ముగుస్తుంది. కథ ఎంత గొప్పగా మొదలైనా దాని సక్సెస్ ముగింపు పైనే ఆధారపడి ఉంటుంది.
అయితే కథ ఏదైనా ప్రీ క్లైమాక్స్ కి మించి క్లైమాక్స్ ఉండవలసి ఉంటుంది. కొన్ని సందర్భాలలో క్లైమాక్స్ కంటే ప్రీ క్లైమాక్స్ హెవీగా అనిపిస్తుంది. క్లైమాక్స్ కంటే కూడా ప్రీ క్లైమాక్స్ ఎక్కువ ఇంపాక్ట్ ను చూపిస్తుంది. అలాంటి అరుదైన ఒక సన్నివేశం మనకి ‘కాంతార: చాప్టర్ 1’లో కనిపిస్తుంది. ఈ సినిమా ప్రీ క్లైమాక్స్ లో రాజుకీ .. హీరోకి మధ్య అడవిలో చోటుచేసుకునే సన్నివేశం సినిమా మొత్తానికి హైలైట్ గా నిలుస్తుంది. దేవుడు ఆవేశించినట్టుగా హీరో చేసే హడావిడి ఆడియన్స్ తో ఔరా అనిపిస్తుంది.
ఈ సీన్ చూస్తున్ననంత సేపు ఇదే క్లైమాక్స్ సీనేమో అనిపిస్తుంది. ఇంత జరిగిన తరువాత ఇంకా ఏం ఉంటుందనే ఆలోచన కలుగుతుంది. అయితే క్లైమాక్స్ ను కూడా బాగానే డిజైన్ చేశారు .. గ్రాఫిక్స్ తో హడావిడి చేశారుగానీ, ఆడియన్స్ పై ప్రీ క్లైమాక్స్ ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. క్లైమాక్స్ కంటే ఎక్కువ మార్కులను కొట్టేస్తుంది. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలలో క్లైమాక్స్ కంటే, ఎక్కువ ఇంపాక్ట్ చూపించిన ప్రీ క్లైమాక్స్ కలిగినదిగా ‘కాంతార: చాప్టర్ 1’ కనిపిస్తుందని చెప్పచ్చు.