తమిళనాడులోని కరూర్ లో జరిగిన ఘోర తొక్కిసలాట ఘటనపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది. నటుడు విజయ్ ఏర్పాటు చేసిన రాజకీయ సభలో జరిగిన ఈ దుర్ఘటనలో 39 మంది ప్రాణాలు కోల్పోవడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, సహాయక చర్యలపై పూర్తి వివరాలతో తక్షణమే నివేదిక సమర్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
శనివారం విజయ్ తన టీవీకే పార్టీ తరఫున నిర్వహించిన బహిరంగ సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. సభా ప్రాంగణం జనంతో కిక్కిరిసిపోయిన సమయంలో ఒక్కసారిగా తోపులాట జరిగి తొక్కిసలాటకు దారితీసింది. ఊపిరాడక, కిందపడిపోయి జనం కాళ్ల కింద నలిగిపోవడంతో 39 మంది చనిపోగా, మరో 46 మంది తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న వెంటనే సీనియర్ మంత్రులు అన్బిల్ మహేశ్ పొయ్యమొళి, మా సుబ్రమణియన్ హుటాహుటిన కరూర్ చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. క్షతగాత్రులను కరూర్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. వీరిలో ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉందని, వారిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నామని అధికారులు తెలిపారు. ఆసుపత్రి ప్రాంగణం బాధితులు, వారి బంధువుల ఆర్తనాదాలతో యుద్ధ వాతావరణాన్ని తలపించిందని స్థానిక అధికారులు పేర్కొన్నారు. అదనపు డీజీపీ (శాంతిభద్రతలు) డేవిడ్సన్ దేవశిర్వతం సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ. లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. బాధితులను పరామర్శించేందుకు, భవిష్యత్ కార్యక్రమాలకు భద్రతా ఏర్పాట్లను సమీక్షించేందుకు సీఎం స్టాలిన్ కరూర్ లో పర్యటించనున్నారు.
సభా ప్రాంగణంలో ఉన్నట్లుండి జనం ముందుకు తోసుకురావడంతోనే ఈ ఘోరం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. భద్రతా వైఫల్యాలు, నిర్వాహకుల లోపాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవలి కాలంలో రాజకీయ సభల్లో జరిగిన అతిపెద్ద విషాదాల్లో ఒకటిగా ఈ ఘటన నిలిచింది.
					