భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించిన రోజు.. 2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్. సరిగ్గా 18 ఏళ్ల క్రితం ఇదే రోజున (సెప్టెంబర్ 24) ఎంఎస్ ధోనీ సారథ్యంలోని యువ భారత్, చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఓడించి తొలి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఈ చారిత్రక విజయానికి 18 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నాటి జట్టులోని హీరోలు యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, రాబిన్ ఉతప్ప తమ మధుర జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
ఆ టోర్నీలో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టి చరిత్ర సృష్టించిన యువరాజ్ సింగ్, జట్టు ట్రోఫీతో సంబరాలు చేసుకుంటున్న ఫొటోలను షేర్ చేశారు. “కొన్ని జ్ఞాపకాలు ఎప్పటికీ మరుపురావు, ఇది కచ్చితంగా అలాంటిదే! దేశాన్ని ఆనందం, గర్వంతో ఏకం చేసిన క్షణమిది” అని తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు. ఫైనల్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచిన ఇర్ఫాన్ పఠాన్, “2007లో అదొక అద్భుతమైన రోజు. మా ప్రపంచకప్ కల నెరవేరింది. టీ20 క్రికెట్‌లో పాకిస్థాన్‌ను ఓడించడం అక్కడి నుంచే మొదలైంది” అని పేర్కొన్నారు.
మరో కీలక ఆటగాడు రాబిన్ ఉతప్ప కూడా స్పందిస్తూ, “సెప్టెంబర్ 24, 2007 – నా జ్ఞాపకాలలో ఎప్పటికీ నిలిచిపోయే రోజు. ఆ ప్రపంచకప్ గెలిచిన జట్టులో భాగం కావడం ఒక మ్యాజిక్ లాంటిది. ఆనాటి మా నమ్మకం, ఐక్యత ఇప్పటికీ సజీవంగా ఉన్నట్లు అనిపిస్తుంది” అని తన భావాలను పంచుకున్నారు.
2007లో జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన ఆ ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్, గౌతమ్ గంభీర్ (54 బంతుల్లో 75) అద్భుత ఇన్నింగ్స్‌తో 5 వికెట్లకు 157 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ తడబడింది. అయితే, మిస్బా-ఉల్-హక్ చివరి వరకు పోరాడి మ్యాచ్‌ను ఉత్కంఠభరితంగా మార్చాడు. చివరి ఓవర్‌లో పాక్ విజయానికి 13 పరుగులు అవసరం కాగా, కెప్టెన్ ధోనీ బంతిని జోగిందర్ శర్మకు ఇచ్చాడు. మిస్బా ఒక సిక్సర్ బాదినప్పటికీ, ఆ తర్వాతి బంతికే అతడిని ఔట్ చేసిన జోగిందర్, భారత్‌కు 5 పరుగుల తేడాతో చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.