ఇప్పుడు అంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న సినిమా ‘కాంతార:చాప్టర్ 1’. గతంలో సంచలన విజయాన్ని నమోదు చేసిన ‘కాంతార’కి ఇది ప్రీక్వెల్. అంటే అప్పటి ‘కాంతార’కి ముందు ఏం జరిగిందనేది ఇప్పుడు తెరపైకి రానుంది. రిషభ్ శెట్టి కథానాయకుడిగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, అక్టోబర్ 2వ తేదీన ప్రపంచవ్యాప్తంగా 7 వేల స్క్రీన్లలో విడుదల చేయనున్నారు. ఇది కన్నడ సినిమా స్థాయిని పెంచిన విషయంగా చెబుతున్నారు. ప్రతినాయకుడిగా గుల్షన్ దేవయ్య .. యువరాణిగా రుక్మిణి వసంత్ ఈ సినిమాలో కీలకంగా కనిపించనున్నారు.
ఈ సినిమాను కన్నడతో పాటు తెలుగు .. తమిళ .. మలయాళ .. హిందీ .. ఇంగ్లిష్ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో వదిలిన ట్రైలర్ కి అన్ని వైపుల నుంచి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. రిలీజ్ చేసిన అన్ని భాషల్లో కలుపుకుని, 24 గంటల్లోనే ఈ ట్రైలర్ 107 మిలియన్ డిజిటల్ వ్యూస్ ను రాబట్టడం ఒక రికార్డ్. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఏ స్థాయిలో వెయిట్ చేస్తున్నారనడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. గతంలో వచ్చిన ‘కాంతార’లో, అడవిలో కథానాయకుడి వేట .. కథానాయికతో ప్రేమ .. అక్కడి ‘పంజుర్లి’ సంప్రదాయం .. గ్రామీణ స్థాయి విలనిజాన్ని గురించి చూపిస్తూ వెళ్లారు. అయితే ఈ సారి కథను రిషభ్ శెట్టి మరింత విస్తృతంగా రాసుకున్నాడు. ‘కాంతార’ అడవి పట్ల విశ్వాసం లేని రాజు .. అక్కడికి వ్యాపారం నిమిత్తం వెళ్లిన కాంతార గ్రామస్తులు .. యువరాణిని చూసి కథానాయకుడు మనసు పారేసుకోవడం .. ఆ విషయం తెలిసిన రాజు, వంశానికి అంటిన కళంకాన్ని కాంతార వాళ్ల రక్తంతో కడిగేయాలని నిర్ణయించుకోవడం వంటి ఉత్కంఠను రేకెత్తించే అంశాలు ఈ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి.