పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘ఓజీ’ విడుదలకు రంగం సిద్ధమైంది. రేపు (గురువారం) ఈ సినిమా థియేటర్లలోకి రానుండగా, మరికొన్ని గంటల్లోనే తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో ‘ఓజీ’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త ప్రకంపనలు సృష్టిస్తోంది. అభిమానుల నుంచి వస్తున్న అనూహ్య స్పందనతో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.
ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ ‘బుక్ మై షో’లో ‘ఓజీ’ టికెట్ల అమ్మకాలు ప్రభంజనం సృష్టిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లోనే ఏకంగా 2.74 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయంటే పవన్ మేనియా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటివరకు మొత్తం మీద సుమారు 6.30 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. ఇదే జోరు కొనసాగితే, వారాంతం నాటికి ఈ సంఖ్య సులభంగా పది లక్షల మార్కును దాటుతుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ముఖ్యంగా నైజాం ఏరియాలో ‘ఓజీ’ బుకింగ్స్ ఆల్ టైమ్ రికార్డులను నమోదు చేస్తున్నాయి. కేవలం సింగిల్ స్క్రీన్ బుకింగ్స్‌తోనే ఇటీవల సంచలనం సృష్టించిన ‘పుష్ప 2’ ప్రీమియర్ టికెట్ల అమ్మకాల రికార్డును ‘ఓజీ’ సింగిల్ స్క్రీన్స్ బుకింగ్స్తోనే బీట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. హైదరాబాద్‌లో మంగళవారం రాత్రి ప్రీమియర్ షోల బుకింగ్స్ ప్రారంభించగా, నిమిషాల వ్యవధిలోనే షోలన్నీ హౌస్‌ఫుల్ బోర్డులతో నిండిపోయాయి. ప్రీమియర్ టికెట్ ధర రూ. 800 ఉన్నప్పటికీ, తమ అభిమాన నటుడిని గ్యాంగ్‌స్టర్‌గా తెరపై చూసేందుకు అభిమానులు ఏమాత్రం వెనుకాడటం లేదు.
సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించారు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి ప్రతినాయకుడి పాత్ర పోషించగా, ప్రకాశ్ రాజ్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రానికి ఎస్. తమన్ సంగీతం అందించారు.