తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ నెల 21న హైదరాబాద్ శివారులో మొక్కలు నాటే కార్యక్రమం ఉంటుంది. అదే రోజు సాయంత్రం హన్మకొండలోని చారిత్రక వేయిస్తంభాల ఆలయం ప్రాంగణంలో రాష్ట్రస్థాయి వేడుకలకు శ్రీకారం చుట్టనున్నారు.
బతుకమ్మ సంబరాల షెడ్యూల్ ఇదీ
ఈ నెల 22న హైదరాబాద్‌లోని శిల్పారామంలో, మహబూబ్ నగర్‌లోని పిల్లలమర్రి వద్ద సంబరాలు నిర్వహిస్తారు. 23న నాగార్జున సాగర్‌లోని బుద్ధవనం, 24న భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం, కరీంనగర్ సిటీ సెంటర్‌లో వేడుకలు జరుగుతాయి.
25న భద్రాచలం, ఆలంపూర్ జోగులాంబ ఆలయాల్లో పండుగ నిర్వహిస్తారు. 26న నిజామాబాద్‌లోని అలీసాగర్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో సంబరాలు ఉంటాయి. అదే రోజు ఉదయం హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులో సైకిల్ ర్యాలీ నిర్వహిస్తారు.
27న ఉదయం నెక్లెస్ రోడ్డులో మహిళల బైక్ ర్యాలీ, సాయంత్రం ఐటీ కారిడార్‌లో బతుకమ్మ కార్నీవాల్ ఉంటాయి. 28న నగరంలోని ఎల్బీ స్టేడియంలో 50 అడుగుల బతుకమ్మను ఏర్పాటు చేసి, 10 వేల మందికి పైగా మహిళలతో గిన్నిస్ వరల్డ్ రికార్డు లక్ష్యంగా భారీ వేడుకలను నిర్వహిస్తారు. 29న పీపుల్స్ ప్లాజాలో ఉత్తమ బతుకమ్మ పోటీలు నిర్వహిస్తారు. స్వయం సహాయక సంఘాలతో కార్యక్రమాలు చేపడతారు.
30న ట్యాంక్‌బండ్‌పై గ్రాండ్ ఫ్లోరల్ పరేడ్, వింటేజ్ కార్ల ర్యాలీ, బతుకమ్మ లైటింగ్ ప్రదర్శన, జపనీయుల ప్రదర్శన (ఇకెబానా), సచివాలయంపై 3డీ మ్యాప్ లేజర్ షో నిర్వహిస్తారు. ఈ నెల 25 నుంచి 29 వరకు హైదరాబాద్ స్టేట్ గ్యాలరీలో బతుకమ్మ ఆర్ట్ క్యాంప్ ఉంటుంది.