కర్ణాటకలో వినాయక నిమజ్జన వేడుకల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య జరుగుతున్న గణేష్ నిమజ్జన ఊరేగింపుపైకి ఓ లారీ దూసుకెళ్లడంతో ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు సహా మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ హృదయ విదారక ఘటన శుక్రవారం సాయంత్రం హసన్ జిల్లాలోని మొసలె హోసహళ్లి రైల్వే గేటు సమీపంలో జరిగింది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, మొసలె హోసహళ్లి, హిరెహళ్లి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వినాయక నిమజ్జనం కోసం శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో అతివేగంతో, నిర్లక్ష్యంగా వచ్చిన ఓ సరుకు లారీ అదుపుతప్పి జనసమూహంపైకి దూసుకెళ్లింది. తొలుత ఓ బైక్ను ఢీకొట్టి, ఆ తర్వాత డివైడర్ను ఢీకొని, చివరకు ఊరేగింపులో ఉన్న భక్తులను చిదిమేసింది. ఈ ఘటనతో వేడుక ప్రాంగణం ఆర్తనాదాలతో దద్దరిల్లింది.
ఈ ఘోర ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మృతుల్లో ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్నారని పోలీసులు ధ్రువీకరించారు. తీవ్రంగా గాయపడిన వారిని హసన్, హోళెనరసిపుర పట్టణాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆగ్రహంతో ఊగిపోయిన స్థానికులు, లారీ డ్రైవర్ భువనేశ్ను బయటకు లాగి చితకబాదారు. ప్రస్తుతం అతను కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
					