మూసీ ప్రక్షాళన ద్వారా హైదరాబాద్ నగర ప్రజల తాగునీటి సమస్య పరిష్కారమవడంతో పాటు, నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య కూడా తీరుతుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మూసీ నది పునరుజ్జీవన కార్యక్రమంలో భాగంగా ఉస్మాన్ సాగర్ వద్ద చేపట్టిన గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్ 2, 3 ప్రాజెక్టు పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ నగర దాహార్తిని తీర్చడానికే గోదావరి తాగునీటి పథకాన్ని తీసుకువచ్చామని తెలిపారు.
వరద నియంత్రణ కోసమే ఉస్మాన్ సాగర్, హిమయత్ సాగర్ జంట జలాశయాలను నిర్మించారని ఆయన గుర్తుచేశారు. తాగునీటి సమస్యల పరిష్కారం కోసం పీజేఆర్ ఎన్నో పోరాటాలు చేశారని ఆయన స్మరించుకున్నారు. రూ. 7,360 కోట్లతో హ్యామ్ విధానంలో ఈ పనులు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. నల్గొండ జిల్లాలో పాదయాత్ర చేసినప్పుడు మూసీ నదిని ప్రక్షాళన చేయాలని ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. సమస్యలు ఎదురైనా సమన్వయంతో ముందుకు వెళుతున్నామని అన్నారు.
ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతోందని ఆయన పేర్కొన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఈ పథకాన్ని పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. మూసీ నది ప్రక్షాళన ఎందుకు జరగకూడదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. త్వరలోనే మహారాష్ట్రకు వెళ్లి అక్కడి ముఖ్యమంత్రిని కలుస్తానని తెలిపారు.