జరగబోయే ఉప రాష్ట్రపతి ఎన్నికల విషయంలో బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో ఓటింగ్ ప్రక్రియకు దూరంగా ఉండాలని ఆ పార్టీ సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులు, అధికార, విపక్ష పార్టీల నుంచి ఎదురయ్యే విమర్శలను తప్పించుకునే వ్యూహంలో భాగంగానే బీఆర్ఎస్ ఈ తటస్థ వైఖరిని ఎంచుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పక్షానికి మద్దతు ఇచ్చినా రాజకీయంగా ఇబ్బందులు తప్పవని బీఆర్ఎస్ నాయకత్వం అంచనా వేస్తోంది. అందుకే, ఓటింగ్‌కు దూరంగా ఉండటమే ఉత్తమమని బీఆర్ఎస్ భావిస్తున్నట్లు సమాచారం. ఎన్నికల్లో ‘నోటా’ అవకాశం లేకపోవడం కూడా ఈ నిర్ణయానికి మరో కారణంగా తెలుస్తోంది.
ఈసారి విపక్షాల ఇండియా కూటమి తరఫున తెలంగాణకు చెందిన ప్రముఖ న్యాయకోవిదుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో నిలవడం గమనార్హం. ఆయన తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించడమే కాకుండా, రాజకీయాలకు అతీతమైన వ్యక్తిగా గుర్తింపు పొందారు. అయినప్పటికీ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం, బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరిస్తుండటంతో ఇరు పార్టీల మధ్య తీవ్రమైన రాజకీయ వైరం నడుస్తోంది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్న ఇండియా కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వడం సరికాదని బీఆర్ఎస్ భావిస్తోంది. 2022లో జరిగిన ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి మార్గరెట్ అల్వాకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చినా, ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది.
ప్రస్తుతం రాజ్యసభలో బీఆర్ఎస్ పార్టీకి సుదర్శన్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, దామోదర్ రావు, పార్థసారధి రెడ్డి రూపంలో నలుగురు సభ్యుల బలం ఉంది.