ఆసియా కప్ వేట షురూ.. దుబాయ్‌లో ప్రాక్టీస్ ప్రారంభించిన భారత జట్టు

V. Sai Krishna Reddy
1 Min Read

ఆసియా కప్‌లో టైటిల్ నిలబెట్టుకునే లక్ష్యంతో డిఫెండింగ్ ఛాంపియన్ భారత క్రికెట్ జట్టు తమ సన్నాహకాలను ప్రారంభించింది. టోర్నమెంట్‌కు ఆతిథ్యమిస్తున్న యూఏఈకి ముందుగానే చేరుకున్న టీమిండియా, శుక్రవారం దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీలో పూర్తిస్థాయి ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పర్యవేక్షణలో ఆటగాళ్లంతా నెట్స్‌లో చెమటోడ్చారు.

ఇటీవల ఇంగ్లండ్‌తో ముగిసిన టెస్ట్ సిరీస్ తర్వాత భారత ఆటగాళ్లు కలిసి శిక్షణ తీసుకోవడం ఇదే తొలిసారి. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, సంజూ శాంసన్, జితేశ్‌ శర్మ వంటి కీలక ఆటగాళ్లు నెట్స్‌లో చాలాసేపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. అక్కడి వాతావరణానికి అలవాటు పడేందుకు ఈసారి జట్టు యాజమాన్యం భారత్‌లో ఎలాంటి ప్రత్యేక శిబిరం నిర్వహించకుండా, నేరుగా దుబాయ్‌లోనే శిక్షణకు మొగ్గు చూపింది.

ఈ టోర్నీలో అందరి దృష్టి స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపైనే ఉంది. 2024 టీ20 ప్రపంచకప్ ఫైనల్ తర్వాత బుమ్రా మళ్లీ ఈ ఫార్మాట్‌లో ఆడనుండటం ఇదే తొలిసారి. సుమారు 40 రోజుల విరామం తర్వాత జట్టుతో కలిసిన అతను, నెట్స్‌లో ఉత్సాహంగా కనిపించాడు. మరోవైపు, స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సరికొత్త బ్లాండ్ హెయిర్‌డోతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ప్రాక్టీస్ అనంతరం అతను అభిమానులతో ముచ్చటిస్తూ ఆటోగ్రాఫ్‌లు ఇచ్చాడు.

భారత్ ఈ టోర్నీలో తమ తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 10న యూఏఈతో ఆడనుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 14న దాయాది పాకిస్థాన్‌తో, 19న ఒమన్‌తో తలపడనుంది. భారత్ ఇప్పటికే రికార్డు స్థాయిలో 8 సార్లు ఆసియా కప్ గెలుచుకోవడం విశేషం. ఈ టోర్నమెంట్‌లో గ్రూప్-ఏలో భారత్‌తో పాటు పాకిస్థాన్, యూఏఈ, ఒమన్ జట్లు ఉండగా, గ్రూప్-బీలో శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, హాంకాంగ్ ఉన్నాయి. స్పాన్సర్ లోగోలు లేకుండానే భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ జెర్సీలతో శిక్షణలో పాల్గొన్నారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *