రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. యూరియా గురించి ప్రశ్నిస్తున్న వారిని వేధిస్తున్నారని మండిపడ్డారు. యూరియా కొరతపై ప్రశ్నించడమే నేరమా? అని ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యమంటే వేధింపులు, బెదిరింపులా? అని అడిగారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో యూరియా కొరతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రైతు లక్ష్మణ్ యాదవ్ నిలదీశాడని పోలీసులు ఇంటికి వెళ్లి వేధింపులకు గురిచేశారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నాయకుడు ఫిర్యాదు చేయడమే ఆలస్యం అన్నట్టుగా పోలీసులు చట్టవ్యతిరేక చర్యలకు దిగుతున్నారని విమర్శించారు. ఇలాంటి దారుణాలను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని అన్నారు. పాలకుల మెప్పుకోసం ప్రజలను ఇబ్బంది పెడితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనే విషయం గుర్తు పెట్టుకోవాలని కవిత హెచ్చరించారు.