జింబాబ్వే సీనియర్ క్రికెటర్ సీన్ విలియమ్స్ అంతర్జాతీయ టీ20 క్రికెట్లో సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు. పొట్టి ఫార్మాట్లో సుదీర్ఘ కాలం పాటు ఆడిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో బరిలోకి దిగడం ద్వారా విలియమ్స్ ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇప్పటివరకు ఈ రికార్డు బంగ్లాదేశ్ స్టార్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ పేరిట ఉండేది.
దాదాపు ఏడాదికి పైగా విరామం తర్వాత టీ20 జట్టులోకి పునరాగమనం చేసిన సీన్ విలియమ్స్ తన కెరీర్ను 18 సంవత్సరాల 279 రోజులకు పొడిగించుకున్నాడు. దీంతో 18 ఏళ్లకు పైగా టీ20 ఫార్మాట్లో ఆడిన తొలి క్రికెటర్గా నిలిచాడు. మరోవైపు, 2024 టీ20 ప్రపంచకప్ తర్వాత ఆటకు వీడ్కోలు పలికిన షకీబ్ అల్ హసన్ 17 సంవత్సరాల 166 రోజుల పాటు టీ20 క్రికెట్లో కొనసాగాడు. విశేషమేమిటంటే, 2006లో బంగ్లాదేశ్, జింబాబ్వే మధ్య జరిగిన ఒకే మ్యాచ్ ద్వారా విలియమ్స్, షకీబ్ ఇద్దరూ తమ టీ20 అరంగేట్రం చేశారు.
ఇదే మ్యాచ్లో జింబాబ్వే ఆటగాడు బ్రెండన్ టేలర్ కూడా అరంగేట్రం చేశాడు. అతను కూడా జట్టులోకి తిరిగి వస్తే విలియమ్స్ సరసన చేరే అవకాశం ఉండేది. అయితే, శ్రీలంక సిరీస్కు ఎంపికైనప్పటికీ గాయం కారణంగా అతడు తప్పుకోవాల్సి వచ్చింది. ఇక శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్ విషయానికొస్తే జింబాబ్వే ఓటమి చవిచూసింది. జింబాబ్వే నిర్దేశించిన 176 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక ఛేదించి విజయం సాధించింది.