రైతుల పాలిట శత్రువు వయ్యారి భామ …!

Kamareddy
3 Min Read

రైతుల పాలిట శత్రువు వయ్యారి భామ …!

ఆగష్టు 17 నుండి 23 వరకు నివారణ వారోత్సవం

గుమ్మడిలక్ష్మీనారాయణ,

సామాజిక రచయిత

రామారెడ్డి ఆగస్టు 22 (ప్రజా జ్యోతి)

వయ్యారిభామ’ అంటే అందాల ఆరబోత కాదు. మనసును దోచుకునే సుందరాంగి అంతకన్నా కాదు. ఇలా అనుకుంటే పొరబాటే. రైతుల పాలిట శత్రువు ఇది. నష్టం కలిగించడమే దీని పని. కోట్లాది రూపాయల పంటలను కబళించే కలుపు మొక్క ఒక మామూలు గడ్డి మొక్కే కదా అని వదిలేస్తే మొదటికే మోసం. దీని వల్ల కలిగే నష్టాన్ని సకాలంలో గుర్తించడం అనివార్యం. వృక్ష శాస్త్ర పరంగా ఈ మొక్కను ‘పార్థీనియం హిస్టరో పోరస్’ అంటారు. ‘ఆస్టరేసి’ కుటుంబానికి చెందింది ఇది. ఈ మొక్క కలిగించే దుష్ప్రభావం మానవ జాతికి, జంతువులకు కూడా ఆత్యంత ప్రమాదకరంగా ఉంటోందని వ్యవసాయ శాస్త్ర వేత్తలు గుర్తించారు. ఇంత కాలం ఈ మొక్కలకు నిర్మూలించకుండా నిర్లక్ష్యం చేసినందుకు సర్వే చేసి రూ.662 కోట్లు పడతాయని 2011 అక్టోబర్ 5న అప్పటి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది.

పార్థీనియం పూర్వాపరాలు..!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని చాలాచోట్ల ఇది కనిపిస్తుంది. పొలాల గట్లపైనా, పంటల్లోనూ, బీడు భూముల్లోనూ, ఇంటి చుట్టూ ఖాళీ ప్రదేశాల్లోనూ ఈ మొక్క పెరుగుతుంది. తెల్లపూలతో విరివిగా కన్పించే ఈ వయ్యారిభామ విదేశి మొక్క. 1950లో అమెరికా నుంచి గోధుమలను దిగుమతి చేసుకునే క్రమంలో ఇది నౌకల ద్వారా మన దేశంలోకి ప్రవేశించింది. ఒక పొరుగు దేశం నుంచి వలస వచ్చి 60 ఏండ్లలో దేశమంతా విస్తరించింది. తెలుగు రాష్ట్రాల్లో సుమారు 22 లక్షల హెక్టార్ల భూముల్లో పార్టీనియం విస్తరించిందని 2011 నివేదికలు చెబుతున్నాయి. వ్యవసాయ భూములు, మారుమూల గిరిజన ప్రాంతాల్లో దీని మొక్కలు బాగా విస్తరించాయి.

వ్యాప్తి – తెగుళ్ళు…,!

ఈ మొక్క విత్తనాలు గాలి ద్వారా వేగంగా వ్యాప్తి చెందుతాయి. జూలై నుంచి అక్టోబర్ వరకు వీటికి వ్యాప్తి చెందే కాలం. వాతావరణం అనుకూలంగా ఉంటే నాలుగు వారాల్లో పుష్పించే దశకు చేరుకుంటుంది. ఒక్కో మొక్క 50 వేల విత్తనాలను ఉత్పత్తి చేస్తుంది. విత్తనాలు గాలి, నీటి ద్వారా వ్యాప్తి చెందుతాయి. వీటి పూల నుంచి పుప్పొడి రేణువులు టమాట, వంగ, మిరప పంట మొక్కలపై పడి నష్టాలు కలిగిస్తాయి. పుష్పాలు, పిందెలు తయారు కాకుండా చేస్తాయి. కొన్నిరకాల వైరస్ తెగుళ్లను వ్యాప్తింపజేస్తాయి. ఇంకా ఈ పార్టీనియా మొక్కలు నేలలో నత్రజనిని నిల్వ ఉండకుండా దెబ్బతీస్తుంది. ఫలింతంగా పంట మొక్కలు నత్రజని గ్రహించక ఏపుగా పెరగవు. దీంతో రైతులు పైర్లకు యూరియాను అధికంగా వాడాల్సి వస్తోంది. రసాయనిక ఎరువుల వాడకానికి, సాగు వ్యయం పెరగడానికి ఈ కలుపు మొక్కలే కారణం. పంటలకు తెగుళ్లు వ్యాపించడానికి పరోక్షంగా ఈ మొక్కలే వాహకాలు. పంట దిగుబడి తగ్గడానికి కారణమవుతున్నాయి. పాడి పశువులు ఈ మొక్కలను తింటే వాటి శరీర బరువు తగ్గి, పాల దిగుబడి పడిపోతుంది. గేదెలు, మేకలు, గొర్రెలు, అనారోగ్యానికి గురవుతున్నాయి. పొలాల్లో పనిచేసే కూలీలు, రైతులకు ఈ కలుపు మొక్కలు వెదజల్లే పుప్పుడి(పరాగ రేణువులు) వల్ల ఉబ్బసం (ఆస్తమా) వంటి ఊపిరితిత్తుల వ్యాధులు, కండ్ల మంట, ఆకుల స్పర్శ వల్ల చర్మ వ్యాధులు, విషజ్వరాలు సంభవిస్తున్నాయి.

నివారణ…!

వయ్యారి భామను పూర్తిగా నియంత్రించడం సాధ్యం కాదు. కలుపు నివారణ మందులు వాడటంతో తాత్కాలికంగా నివారించగలిగినా మరుసటి ఏడాది విత్తనాలు మళ్లీ మొలకెత్తుతూనే ఉంటాయి.

👉 వయ్యారి భామ కలుపు మొక్కపై రైతులకు సరైన అవగాహన కల్పించాలి.

👉వయ్యారి భామ మొక్కలను వేళ్ల సహా పీకి కాల్చేస్తే కనీసం వరుసగా రెండేళ్ల పాటైనా వీటిని నివారించొచ్చు.

👉మొక్కలు వేళ్ల సహా పీకేసి కాల్చేసేటప్పుడు చేతికి తొడుగులు ధరించడం తప్పనిసరి.

👉 జైగో గ్రామ బైకొలరేటా అనే క్రైసోమిటెడ్ జాతికి చెందినో పెంకు పురుగులను వదిలి జీవ నియంత్రణ పద్ధతి ద్వారా ఈ కలుపు మొక్కలను నివారించొచ్చు.

👉 పంట మార్పిడి పద్ధతిలో భాగంగా బంతిసాగు చేయాలి. ఆ తర్వాత వేసే పంటలో వయ్యారిభామ రాకుండా ఉంటుంది.

👉పార్టీనియాన్ని కంపోస్టు ఎరువుగా తయారు చేసుకునే అవకాశం ఉంది. ఇది వ్యవసాయ అధికారుల సహకారంతో రైతులు తయారు చేసుకోవాలి.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *