కుండపోత వర్షాలతో ముంబై అతలాకుతలం.. 17 లోకల్ రైళ్ల రద్దు.. ఆరెంజ్ అలర్ట్ జారీ

V. Sai Krishna Reddy
1 Min Read

భారీ వర్షాలు మహారాష్ట్రను అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కురుస్తున్న కుండపోత వానలకు జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. నగరంలోని అనేక ప్రాంతాలు జలమయం కావడంతో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) నేడు ముంబైకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ముంబైలోని లోకల్ రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైల్వే ట్రాక్‌లు నీట మునగడంతో సెంట్రల్ రైల్వే నేడు ఏకంగా 17 లోకల్ రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు, విమాన సర్వీసులపైనా వర్షాల ప్రభావం పడింది. ప్రముఖ విమానయాన సంస్థలు ఇండిగో, స్పైస్‌జెట్ తమ ప్రయాణికులకు హెచ్చరికలు జారీ చేశాయి. ప్రతికూల వాతావరణం వల్ల విమానాలు ఆలస్యం కావచ్చని లేదా రద్దయ్యే అవకాశం ఉందని, ప్రయాణికులు ఎయిర్‌పోర్టుకు బయలుదేరే ముందు తమ విమాన స్థితిని సరిచూసుకోవాలని సూచించాయి.

నగరంలోని పలు ప్రధాన రహదారులు నదులను తలపిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా థానే, నవీ ముంబై, లోనావాలా వంటి ప్రాంతాల్లో అధికారులు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు కూడా పాక్షికంగానే పనిచేస్తున్నాయి. కుండపోత వానల కారణంగా బాంబే హైకోర్టు సైతం మధ్యాహ్నం 12:30 గంటలకే కార్యకలాపాలను నిలిపివేసింది. అయితే, గురువారం నుంచి వర్షాల తీవ్రత తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *