ఆఫ్ఘనిస్థాన్‌లో అత్యంత ఘోరమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పశ్చిమ హెరాత్ ప్రావిన్స్‌లో ప్రయాణికులతో వెళ్తున్న ఒక బస్సు, ట్రక్కును ఢీకొనడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో 17 మంది చిన్నారులతో సహా 71 మంది సజీవ దహనమయ్యారు. ఈ విషయాన్ని ప్రభుత్వ అధికారులు బుధవారం అధికారికంగా ధ్రువీకరించారు.
ప్రావిన్షియల్ ప్రభుత్వ అధికార ప్రతినిధి అహ్మదుల్లా ముత్తఖీ ఈ ఘటనపై స్పందించారు. హెరాత్‌లో బస్సు, ట్రక్కు, మోటార్‌సైకిల్ ఢీకొన్నాయన్నారు. ఈ దుర్ఘటనలో 71 మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా తెలిపారు. ఇటీవలి కాలంలో దేశంలో జరిగిన అత్యంత భయంకరమైన ప్రమాదాల్లో ఇది ఒకటని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బస్సు పూర్తిగా మంటల్లో కాలిపోవడం, సమీపంలోని ప్రజలు భయాందోళనలకు గురవ్వడం ఈ వీడియోల్లో కనిపిస్తోంది.
ప్రమాదానికి గురైన బస్సులో ప్రయాణిస్తున్న వారంతా ఇరాన్ నుంచి తిరిగి వస్తున్న ఆఫ్ఘన్ వలసదారులని ప్రావిన్షియల్ అధికారి మహ్మద్ యూసుఫ్ సయీదీ ఏఎఫ్‌పీ వార్తా సంస్థకు తెలిపారు. ఇరాన్‌తో కీలక సరిహద్దు ప్రాంతమైన ఇస్లాం ఖాలాలో వీరంతా బస్సు ఎక్కి రాజధాని కాబూల్‌కు బయలుదేరారని ఆయన వివరించారు. స్వదేశానికి తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘోరం జరగడం తీవ్ర విషాదాన్ని నింపింది.