నాగార్జున డబ్బు కోసం సినిమాలు చేసే వ్యక్తి కాదని, ఆయనకు ఆ అవసరం కూడా లేదని సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. ఎప్పుడూ మంచివాడిగానే నటించాలా అనే ఆలోచనతోనే ఆయన ‘కూలీ’ సినిమాలో విలన్‌గా నటించడానికి అంగీకరించి ఉంటారని అభిప్రాయపడ్డారు. రజనీకాంత్ కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’ చిత్రం రూపొందుతోంది.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో రజనీకాంత్ ప్రత్యేక వీడియో ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమా కథ విన్న వెంటనే అందులోని సైమన్ పాత్రను తాను చేయాలనుకున్నానని ఆయన వెల్లడించారు. ఆ పాత్రను నాగార్జున లాంటి నటుడు పోషించి మెప్పించాడని అన్నారు.
తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను చిత్ర పరిశ్రమకు వచ్చి 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సంవత్సరం లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో నేను నటించిన ‘కూలీ’ ఆగస్టు 14న రావడం సంతోషంగా ఉంది. తెలుగులో రాజమౌళి గారిలాగే తమిళంలో లోకేశ్ కనగరాజ్ కూడా హిట్ డైరెక్టర్. ఆయన చేసిన సినిమాలన్నీ విజయవంతమయ్యాయి.
ఇంకొక విషయం ఏమిటంటే, ఈ చిత్రంలో చాలామంది ముఖ్య తారలు నటించారు. చాలా సంవత్సరాల తర్వాత సత్యరాజ్‌తో కలిసి నటిస్తున్నాను. శ్రుతిహాసన్, ఉపేంద్ర, సౌబిన్‌లతో పాటు అమిర్ ఖాన్ ప్రత్యేకంగా కనిపించనున్నారు. ముఖ్యంగా నాగార్జున ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు. నిజానికి ఈ సినిమా కథ వినగానే ‘సైమన్’ పాత్రను నేనే చేయాలనే అనుకున్నాను.
అలాంటి సైమన్ పాత్రను ఎవరు చేస్తారా అని ఎదురు చూశాను. సైమన్ పాత్ర చాలా స్టైలిష్‌గా ఉంటుంది. ఈ పాత్ర గురించి ఒక నటుడితో ఆరుసార్లు సిట్టింగ్ అయిందని, అయినప్పటికీ ఓకే కాలేదని లోకేశ్ కనగరాజ్ నాతో చెప్పాడు. ఆయనెవరని నేను అడగగా నాగార్జున అని చెప్పాడు. నేను ఆశ్చర్యపోయాను. ఆ తర్వాత నాగార్జున అంగీకరించాడని తెలిసి సంతోషించాను. మేము ఇద్దరం 33 ఏళ్ల కిందట ఒక సినిమాలో కలిసి నటించాం. నాగార్జున అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పటికీ అలాగే ఉన్నారు కానీ… నా జుట్టు మాత్రం ఊడిపోయింది. నాగార్జున ఆరోగ్య రహస్యం గురించి అడిగాను. వ్యాయామం, ఈత, కొద్దిగా డైట్, తండ్రి నుంచి వచ్చిన జీన్స్ అని చెప్పారు…” అని రజనీకాంత్ తెలిపారు.